ఆదివారం 31 మే 2020
Telangana - May 15, 2020 , 01:46:01

జూన్‌ 30 దాకా బుకింగ్‌లు రద్దు

జూన్‌ 30 దాకా బుకింగ్‌లు రద్దు

  • టికెట్ల డబ్బు వాపస్‌ చేస్తాం
  • ప్రయాణికులకు డబ్బులు తిరిగి చెల్లిస్తామన్న రైల్వే
  • శ్రామిక్‌, ప్రత్యేక రైళ్లు యథాతథం: రైల్వేశాఖ

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వచ్చే నెల 30 వరకు రెగ్యులర్‌ (సాధారణ) రైళ్లల్లో ప్రయాణించడానికి బుకింగ్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికులు చెల్లించిన సొమ్మును తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొంది. దీనిబట్టి వచ్చే నెలాఖరునాటికి రైలు సేవలు ప్రారంభయ్యేలా కనిపించడం లేదు. అయితే వలస కార్మికులను స్వస్థలాలకు తరలించే శ్రామిక్‌ రైళ్లు, ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ప్రత్యేక రైలు సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ మేరకు గురువారం రైల్వే శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘రెగ్యులర్‌గా నడిచే రైళ్లల్లో (మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌) జూన్‌ 30తేదీ వరకు ప్రయాణించడానికి చేసుకున్న టికెట్ల బుకింగ్‌లను రద్దు చేస్తున్నాం. డబ్బులను తిరిగి చెల్లిస్తాం’ అని రైల్వే శాఖ తెలిపింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్‌ చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లోనే రీఫండ్‌ చేరుతుందని వెల్లడించింది. కౌంటర్‌ ద్వారా టికెట్‌ రిజర్వు చేసుకున్నవాళ్లు ప్రయాణ తేదీ నుంచి 60 రోజుల్లోగా ఎప్పుడైనా రీఫండ్‌ను పొందవచ్చని సూచించింది.


ఎంక్వయిరీ నంబర్‌ 139కి ఫోన్‌ చేయొచ్చు

కౌంటర్‌ ద్వారా టికెట్‌ తీసుకుని కరోనా కారణంగా లేదా ఇతర కారణాలతో బయటకు రాలేనివారు రైల్వే ఎంక్వయిరీ నెంబర్‌ 139కి ఫోన్‌ చేసి రద్దు సేవలు పొందవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా కూడా టికెట్‌ రద్దు చేసుకున్నా రీఫండ్‌ పూర్తిస్థాయిలో వస్తుంది. మరోవైపు ప్రత్యేక రైళ్లలో ఇప్పటివరకు రిజర్వేషన్‌ టికెట్లు మాత్రమే జారీచేసిన దక్షిణమధ్య రైల్వే శుక్రవారం నుంచి వెయిటింగ్‌ లిస్టు టికెట్లు కూడా జారీచేయనుంది.

ఐఆర్‌సీటీసీకి ఇంటి అడ్రస్‌ తెలపాలి

రైల్వే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరిన తర్వాత కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలుతున్నది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సెట్‌ ద్వారా టికెట్‌ బుక్‌చేసుకునేటప్పుడు తమ ఇంటి అడ్రస్‌ను కూడా పొందుపర్చాలి. తద్వారా ప్రయాణికులు గమ్యస్థానం చేరిన తర్వాత ఒకవేళ వారికి కరోనా ఉన్నట్లు తేలితే కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ సులువు అవుతుంది. అధికారులు మాట్లాడుతూ ఈ నూతన విధానం ఈ నెల 13 నుంచే అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. ఇంకోవైపు శ్రామిక్‌ రైళ్లల్లో దాదాపు 10 లక్షల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించినట్లు రైల్వే తెలిపింది.


logo