శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 03:14:33

ఎల్‌ఏసీ ఇంచు కూడా మారదు

ఎల్‌ఏసీ ఇంచు కూడా మారదు

  • మరోసారి స్పష్టంచేసిన భారత్‌
  • లఢక్‌లో చైనా బలగాల ఉపసంహరణ పూర్తి
  • సరిహద్దుల్లో శాంతికి భారత్‌ కలిసిరావాలి: చైనా

న్యూఢిల్లీ/బీజింగ్‌, జూలై 9: లఢక్‌లోని గల్వాన్‌ లోయ తమదేనన్న చైనా ప్రకటనను భారత్‌ మరోసారి తిరస్కరించింది. ప్రస్తుతం ఉన్న వాస్తవాధీన రేఖను గౌరవించి తీరాల్సిందేనని, ఎలాంటి మార్పులకు కూడా భారత్‌ అంగీకరించదని విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ గురువారం స్పష్టంచేశారు. ఎల్‌ఏసీని గౌరవించటంపైనే ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. సరిహద్దులో బలగాల ఉపసంహరణకు శుక్రవారం మరోసారి భారత్‌, చైనా దౌత్య అధికారులు చర్చలు జరిపే అవకాశం ఉందని చెప్పారు. 

కాగా లఢక్‌లోని గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌ నుంచి చైనా బలగాలు గురువారం పూర్తిగా వెనక్కు వెళ్లాయి. తూర్పు లఢక్‌లో మూడు ప్రాంతాల్లో ఇరుదేశాల సైనికులు వాస్తవాధీనరేఖ నుంచి మూడు కిలోమీటర్లు వెనక్కు వెళ్లి బఫర్‌జోన్‌ను ఏర్పాటుచేశారని అధికారవర్గాలు వెల్లడించాయి. ప్యాంగాంగ్‌ త్సోలోని ఫింగర్‌ 4 వద్ద కూడా బలగాలను తగ్గించారు. మరోవైపు వాస్తవాధీన రేఖ వెంట బలగాల ఉపసంహరణ సమర్థంగా కొనసాగుతున్నదని చైనా ప్రకటించింది. ఉద్రిక్తత ఏర్పడిన అన్ని చోట్లా పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ గురువారం తెలిపారు. సరిహద్దుల్లో సుస్థిర చర్యలకు భారత్‌ తమతో కలిసి పనిచేస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.


logo