బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 01:58:59

నీ కోసమే ఈ అన్వేషణ!

నీ కోసమే ఈ అన్వేషణ!
  • భాగస్వామి కోసం వెతుకులాట
  • 2100 కి.మీ. దాటిన ప్రయాణం
  • అలుపెరగకుండా ఓ పులి ప్రయత్నం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆశ చావలేదు..అన్వేషణ ఆగలేదు! కొండాకోన, కాలువ దాటాలి.. భాగస్వామిని వెతికిపట్టాలి! నీ కోసమే ఈ అన్వేషణ! నీ ధ్యాసలో ఈ ఆలాపన! విరహవేదన.. నరకయాతన! కాలమే దీపమై దారిచూపదా! అంటూ భాగస్వామి కోసం అలుపెరగకుండా ప్రయాణిస్తున్నదో పులి. ఏకంగా 2,100 కిలోమీటర్లు దాటినా నడక ఆపలేదు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచి మొదలైన వెతుకులాట ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని కవ్వాల్‌ అభయారణ్యం మీదుగా కొనసాగింది. మహారాష్ట్ర జిల్లాల పరిధిలోని అటవీప్రాంతంలో తిరుగుతూ ప్రస్తుతం హింగోలి అభయారణ్యానికి చేరింది. గెలుపుపొందే వరకు అలుపులేదన్నట్టుగా విశ్రమించకుండా శ్రమిస్తూనే ఉన్న ది. సినిమాల్లో లవర్‌ కోసం దేశాలు దాటి వెతకడం మామూలే. ఫోన్లు, గూగుల్‌ మ్యాప్‌తో తెలియని ప్రదేశంలోనూ ఆచూకీ కనుక్కోవచ్చు.అది రీల్‌ లైఫ్‌, రియల్‌ లైఫ్‌ సాహసం అంటే ఈ పులిదే. పులిని చూసే ్త మనకు భయం. ప్రజలకు దొరికితే దానికి చావు తథ్యం. ఈ పరిస్థితుల్లో భాగస్వామి కోసం అలుపెరుగకుండా ప్రయాణిస్తూనే ఉన్నది. 


జీపీఎస్‌తో కదలికలు గుర్తింపు

యుక్తవయస్సు పులులు సరైన భాగస్వామిని వెతికేందుకు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అభయారణ్యం ఈ యువపులి పుట్టినప్రాంతం. తడోబా, తిప్పేశ్వర్‌ అభయారణ్యాల్లో రేడియోకాలర్లను వినియోగిస్తున్నారు. తిప్పేశ్వర్‌ సాంక్చువరీలో చిక్కిన ఈ యువపులికి అక్కడి అధికారులు గత ఏడాది ఫిబ్రవరిలో రేడియోకాలర్‌ అమర్చారు. జీపీఎస్‌ ద్వారా కదలికలను పసిగట్టగా తిప్పేశ్వర్‌ నుంచి తెలంగాణలోని కవ్వాల్‌ అభయారణ్యం మీదుగా హింగోలి వరకు 2,100 కిలోమీటర్లకుపైగా ప్రయాణించినట్టు గుర్తించారు. మొత్తం పదిజిల్లాలను దాటి మరాఠ్వాడ ప్రాంతంలోని అజంత, ఎల్లోర ప్రాంత అడవులు దాటి హింగోలికి చేరింది. ఆగకుండా నడక కొనసాగిస్తూనే ఉన్నది. మహారాష్ట్ర ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌కాస్వాన్‌ పులిఫొటోతోపాటు, అది తిరిగిన ప్రాంత మ్యాప్‌ను ట్విట్టర్‌లో పోస్టుచేశారు. పులి పగటిపూట ఆకలి తీర్చుకొనేందుకు వేటాడుతూ, రాత్రివేళ భాగస్వామి వేటలో నిమగ్నమైందని ఆయన తెలిపారు.  


logo