సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 03:35:02

వ్యాక్సిన్ల రాజధాని

వ్యాక్సిన్ల రాజధాని

  • మూడింట ఒకవంతు తెలంగాణలోనే ఉత్పత్తి 
  • హైదరాబాద్‌ నుంచే తొలి కొవిడ్‌ టీకా!
  • కరోనాకు ఏకైక ఆశాకిరణం వ్యాక్సిన్‌ పరిశ్రమ
  • పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు 
  • పరిశోధనలకు నిధులు, అనుమతులు, 
  • దిగుమతుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి 
  • ‘ద వ్యాక్సిన్‌ రేస్‌- బ్యాలెన్సింగ్‌ సైన్స్‌ అండ్‌ 
  • అర్జన్సీ’ సదస్సులో మంత్రి కేటీఆర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో మూడింట ఒకవంతు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. మన రాష్ట్రం ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా వెలుగొందుతున్నదని అన్నారు. కరోనావైరస్‌కు టీకా తయారీ, ఉత్పత్తి, పంపిణీలో సైతం హైదరాబాద్‌లోని జీనోమ్‌వ్యాలీ కీలకంగా మారబోతున్నదని చెప్పారు. హైదరాబాద్‌ నుంచే కొవిడ్‌కు తొలి టీకా వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. కరోనా చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తున్న రెమ్‌డెసివిర్‌, ఫావిపిరవిర్‌ వంటి ఔషధాలు కూడా హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. 

ఇప్పటికే ఫార్మాస్యూటికల్‌, బయోటెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్‌ ప్రపంచఖ్యాతి గాంచిందన్నారు. మంత్రి కేటీఆర్‌ మంగళవారం జీనోమ్‌వ్యాలీలో పర్యటించారు. భారత్‌ బయోటెక్‌లోని ప్రయోగశాలలను, వ్యాక్సిన్‌ అభివృద్ధి కార్యక్రమాలను, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. ‘బయోలాజికల్‌-ఈ’లో జరుగుతున్న వ్యాక్సిన్‌ పరిశోధనలను పరిశీలించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌.. ‘ద వ్యాక్సిన్‌ రేస్‌- బ్యాలెన్సింగ్‌ సైన్స్‌ అండ్‌ అర్జన్సీ’ పేరిట సదస్సు నిర్వహించారు. ఇందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌తోపాటు తొలిసారిగా భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా, బయోలాజికల్‌-ఈ ఎండీ మహిమ దాట్ల, ఇండియన్‌ ఇమ్యూనాలజీస్‌ ఎండీ ఆనంద్‌కుమార్‌ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారత్‌లో మొత్తం ఆరు సంస్థలు కరోనా టీకా పరిశోధనల్లో పాల్గొంటుండగా, నాలుగు కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తుండటం గర్వంగా ఉన్నదన్నారు. 

దేశంలోనే మొదటి టీకాను భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేయడం, ఇప్పుడు బయోలాజికల్‌-ఈ సైతం పాలుపంచుకొంటుండటం సంతోషంగా ఉన్నదన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి ఏ దశలో ఉన్నది? ఈ క్రమంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు? ప్రభుత్వం తరఫున ఎలాంటి సదుపాయాలు కోరుకుంటున్నారు? వంటి అంశాలను తెలుసుకొనేందుకే  ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచానికి వ్యాక్సిన్‌ పరిశ్రమ ఏకైక ఆశాకిరణంగా కనిపిస్తున్నదన్నారు. ఇలాంటి తరుణంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి, పంపిణీలో భారత్‌ కీలకంగా మారబోతున్నదని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా ఉన్న తెలంగాణ.. మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ పరిశోధనలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 

డీసెంట్రలైజ్‌.. ఫండింగ్‌.. ఫ్లెక్సిబుల్‌ 

వ్యాక్సిన్‌ తయారీ రంగానికి ప్రభుత్వాల పరంగా ఎలాంటి సహాయం అవసరమని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించగా ‘డీసెంట్రలైజ్‌.. ఫండింగ్‌.. ఫ్లెక్సిబుల్‌'గా ఉండాలని ముగ్గురు వ్యాపారవేత్తలు ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి క్రమంలో ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి వెళ్లడం, ఆర్‌అండ్‌డీకి సంబంధించి ఎలాంటి దిగుమతులు కావాలన్నా అక్కడి నుంచే అనుమతులు తీసుకోవాల్సి రావడం పెద్ద సమస్యగా మారిందని కృష్ణ ఎల్లా ప్రస్తావించారు. అలాకాకుండా ఆర్సీజీఎం వంటి సంస్థలు హైదరాబాద్‌లో శాఖలను తెరిచి ఇక్కడే అనుమతులు ఇవ్వాలని సూచించారు. మహిమ స్పందిస్తూ.. వ్యాక్సిన్‌ అభివృద్ధికి ప్రతి రూపాయిని సొంతంగా వెచ్చించాల్సి వస్తున్నదన్నారు.

ప్రభుత్వం తగినన్ని నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తే పరిశోధనలు మరింత వేగంగా సాగుతాయని చెప్పారు. వ్యాక్సిన్‌ సామర్థ్యం, భద్రతను పరీక్షించే మార్గదర్శకాలను కేంద్రం ఇంకా విడుదల చేయడం లేదన్నారు. అనుమతులకు సంబంధించిన నిబంధనలను కొంత సడలించాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ.. దేశంలో కేవలం ఏడు వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు ఉన్నాయని, అయినా ఇప్పటివరకు తమను ఒకేదగ్గర కూర్చోబెట్టి చర్చలు జరిపే ప్రయత్నం చేయలేదన్నారు. దేశంలోని పరిశోధన సంస్థలు, పరిశ్రమలకు మధ్య అనుసంధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. ‘డీసెంట్రలైజ్‌.. ఫండింగ్‌.. ఫ్లెక్సిబుల్‌' విషయంలో  కేంద్రంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వక్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 


ఎప్పుడు వస్తుంది? 

వ్యాక్సిన్‌ ఎప్పటిలోగా అందుబాటులోకి రావొచ్చని, దాని సామర్థ్యం ఎంతమేర ఉండొచ్చని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. దీనికి మహిమ దాట్ల స్పందిస్తూ.. వచ్చే ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఐదు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదన్నారు. అయితే వాటి సామర్థ్యాన్ని కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది కనీసం 10-15 టీకాలు అనుమతులు పొందవచ్చని చెప్పారు. సామర్థ్యాన్ని ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. మరోవైపు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావొచ్చని ఆనంద్‌కుమార్‌ పేర్కొన్నారు. 

తమ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ఒక్క డోస్‌తో జీవితాంతం వైరస్‌ను ఎదుర్కొనే శక్తి వస్తుందని భావిస్తున్నామని చెప్పారు. మొత్తంగా కనీసం మరో 6-12 నెలల వరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని, అప్పటివరకు ప్రజలు మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం వంటి ప్రమాణాలు పాటించాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. చర్చ సందర్భంగా ప్రపంచ వ్యాక్సిన్ల డిమాండ్‌ను తీర్చేందుకు ఒక భారీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని మహిమ పేర్కొనగా.. హైదరాబాద్‌లో నెలకు 20 కోట్ల డోస్‌లు తయారు చేయగలిగే పరిశ్రమను నెలకొల్పేందుకు తాను సహాయం చేస్తానని ఆనంద్‌కుమార్‌ ముందుకు రావడం విశేషం. కార్యక్రమంలో హైదరాబాద్‌ ఫార్మాసిటీ సీఈవో శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.   

ఇంకో ఏడాది జాగ్రత్తగా ఉండాలి

కరోనా సమూహవ్యాప్తి దశకు చేరిం ది. ప్రజలు మరో ఏడాదిపాటు జాగ్రత్తగా ఉండాల్సిందే. కొవిడ్‌ పెద్దలనే ఎ క్కువగా ప్రభావితం చేస్తున్నది. చిన్నారులు వైరస్‌ బారిన పడుతున్నా.. పెద్దగా అనారోగ్యానికి గురికావడం లేదు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 27-28 వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో, ఐదు ఫేజ్‌-3 దశలో, 150 ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. మరికొన్ని నెలల్లో వీటి సామర్థ్యం తెలుస్తుంది. వ్యాక్సిన్‌ సామర్థ్యం కనీసం 70% ఉంటే ఉత్తమమైనదిగా భావిస్తాం. వైరస్‌ కట్టడికి ‘టెస్టింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, క్వారంటైన్‌, ట్రీట్‌మెంట్‌' విధానం బెటర్‌. ఈ నేపథ్యంలో అర్థవంతమైన చర్చ నిర్వహించినందుకు కేటీఆర్‌కు అభినందనలు.  

-సౌమ్యస్వామినాథన్‌, డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ 

పరిశ్రమలు కలిసి పనిచేయాలి 

వ్యాక్సిన్‌ తయారీకి అందరూ ఒకే విధానాన్ని పాటించరు. నాలుగు పద్ధతులు ఉంటాయి. 1.వైరస్‌ను నిర్వీ ర్యం చేసి శరీరంలోకి పంపడం. 2.వైరస్‌లోని ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకొనే ప్రతిరక్షకా లు ఉత్పత్తిచేయడం. 3.ప్రొటీన్‌ అండ్‌ వెక్టార్‌ పద్ధతి. 4.మన డీఎన్‌ఏ/ఆర్‌ఎన్‌ఏకు ఒక జెనెటిక్‌ కోడ్‌ను  పంపి, ఆ సూక్ష్మజీవిని చంపగలిగే ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేయించడం. ఒక్కో సం స్థ ఒక్కో విధానాన్ని ఎంచుకుంటుంది. మేము డీఎన్‌ఏ/ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీపై 15 ఏండ్లుగా కృషిచేస్తున్నాం. మేము ప్రతి నెల 8-10 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగలుగుతాం. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్‌ డిమాండ్‌ను తట్టుకోవాలంటే ఒకేరకమైన మౌలిక వసతులు ఉన్న పరిశ్రమలన్నీ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. త్వరలో మేము 500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం. 

- మహిమ దాట్ల, బయోలాజికల్‌-ఈ ఎండీ 

నీళ్లసీసా కన్నా తక్కువ ధరలో..  

సాధారణంగా ఒక్కో వ్యాక్సిన్‌ అభివృద్ధికి 14-15 ఏం డ్లు పడుతుంది. కరో నాకు ఏడాది, ఏడాదిన్నరలో టీ కాను తేవాల్సి వస్తున్నది. అయినా మేము పరిశోధనల్లో ఎక్కడా రాజీ పడటంలేదు. మార్కె ట్‌పరంగా మేము పోటీదారులమే అయినా.. కలిసికట్టుగా వైరస్‌పై పోరాడుతున్నాం. వాటర్‌బాటిల్‌ కన్నా తక్కువ ధరలో వ్యాక్సిన్‌ను ఇవ్వగలమని భరోసా ఇస్తున్నా. వ్యాక్సిన్లలో ‘తక్కువ నాణ్యత’ అనే ప్రసక్తే ఉండదు. సైన్స్‌ను ఎవరూ షార్ట్‌కట్‌ చేయలేరు. ప్రపంచానికే మొదటి వ్యా క్సిన్‌ను అందించిన ఘనత హైదరాబాద్‌ సొం తం. భారత్‌లో జరిగే ఆవిష్కరణలన్నింటికీ తెలంగాణ సారథ్యం వహిస్తుంది. అందరూ సీ రం ఇన్‌స్టిట్యూట్‌ గురించి మాట్లాడుతున్నారు. కానీ హైదరాబాద్‌లో అంతకన్నా ఎక్కువ మో తాదులో వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయి. 

- కృష్ణ ఎల్లా, భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌  

ఉత్పత్తి, పంపిణీపై దృష్టిపెట్టాలి

వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక పెద్దసంఖ్యలో ఉత్ప త్తికి పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయి. వాటి సరఫరా వ్యవస్థను ప్రభుత్వాలు సిద్ధంచేసుకోవాలి. వ్యాక్సిన్‌ను మైనస్‌ 70 డిగ్రీల వద్ద నిల్వ చేసి సరఫరా చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్‌ తయారీలో అత్యాధునిక ‘కోడ్‌ ఆన్‌ డీ ఆప్టిమైజేషన్‌' టెక్నాలజీని వినియోగిస్తున్నాం. ఈ వ్యాక్సిన్‌ను చిన్నారులు, వృద్ధులు అందరికీ వేయవచ్చు. ఒక్క డోస్‌తోనే జీవితాంతం రక్షణ ఉంటుందని అంచనా. కరోనాకు సంబంధించి అస్ట్రేలియా, అమెరికాలోని మా భాగస్వాములతో కలిసి 20 రకాల వైరస్‌లను సిద్ధంచేశాం. సెప్టెంబర్‌లో ప్రయోగశాల పరీక్షలు, అక్టోబర్‌లో జంతువులపై ప్రయోగాలు జరుపుతాం. 2021లో ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తాం. 

- ఆనంద్‌ కుమార్‌, ఇండియన్‌ ఇమ్యూనాలజీస్‌ 

మరో 6-12 నెలల వరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. అప్పటివరకు ప్రజలు మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం వంటి ప్రమాణాలు పాటించాలి. 

- మంత్రి కేటీఆర్‌

వచ్చే జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఐదు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. వాటి సామర్థ్యాన్ని కాలమే నిర్ణయిస్తుంది. 

- మహిమ దాట్ల,బయలాజికల్‌-ఈ ఎండీ

వచ్చే ఏడాది కనీసం 10-15 టీకాలు అనుమతులు పొందవచ్చు. వాటి సామర్థ్యాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. 

- కృష్ణ ఎల్లా, భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌

మా వ్యాక్సిన్‌ ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య అందుబాటులోకి రావొచ్చు. మా వ్యాక్సిన్‌ ఒక్క డోస్‌తో జీవితాంతం వైరస్‌ను ఎదుర్కొనే శక్తి వస్తుందని భావిస్తున్నాం.  

- ఆనంద్‌కుమార్‌,ఇండియన్‌  ఇమ్యూనాలజీస్‌ ఎండీ


logo