ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 02:24:25

సుసం‌పన్న తెలం‌గాణ

సుసం‌పన్న తెలం‌గాణ

  • రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.9.6 లక్షల కోట్లకు పెరిగిన జీడీపీ
  • తలసరి ఆదాయం 95,361 నుంచి రూ.2.28 లక్షలకు పెరుగుదల

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రధాన నినాదాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ గత ఆరేండ్లలో ఆ మూడు రంగాలలో గణనీయమైన రీతిలో పురోగమిస్తున్నది. ఓ వైపు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే ఆర్థిక రంగంలో విప్లవాత్మకమైన ప్రగతిని సాధించింది. ఇందుకు గత ఆరేండ్లలో నమోదైన గణాంకాలే నిదర్శనం. రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) రూ.4 లక్షల కోట్లు. ఇప్పుడు అది రూ.9.6 లక్షల కోట్లకు పెరిగింది. ఇంత వేగంగా జీడీపీని పెంచుకున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. వృద్ధి రేటులో తెలంగాణ జాతీయ సగటును అధిగమించింది. మరోవైపు రాష్ట్రం ఏర్పడకముందు తలసరి ఆదాయం రూ.95,361 కాగా, నాలుగేండ్లలోనే అది రూ.2.28 లక్షలకు ఎగబాకింది. అదే కాలంలో తలసరి ఆదాయంలో జాతీయ సగటు రూ.1,36,050గా ఉన్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి సొంత రాబడుల విలువ రూ.35వేల కోట్లు కాగా మూడేండ్లలోనే అది రూ.83వేల కోట్లకు పెరిగింది. రాబడుల వృద్ధిరేటులో కూడా తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. ఇతర రాష్ర్టాల సగటు వృద్ధిరేటు 9.7శాతం ఉండగా, తెలంగాణలో 16శాతం నమోదైంది. తెలంగాణ ఏర్పడినప్పుడు ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌లో రెవెన్యూలోటు రూ.5,547 కోట్లు. కానీ గత ఆరేండ్లలోనూ తెలంగాణ మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓవైపు సుస్థిర పాలనను అందిస్తూ టీఎస్‌ఐపాస్‌ వంటి సులభతర వాణిజ్య విధానాలను అమలుచేస్తూ ఉత్పత్తి, సేవారంగాల్లో భారీ పెట్టుబడుల్ని ఆకర్షించింది.

పెరిగిన సంపద.. జీవన ప్రమాణాలు

ఎక్కడైనా సరే సుస్థిరపాలన ఉంటే ఆర్థికంగా వృద్ధి నమోదవుతుంది. ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉంటే.. శాంతిభద్రతలు బాగుంటే పెట్టుబడులు వెల్లువెత్తుతాయి, పరిశ్రమలు తరలివస్తాయి. ఉత్పత్తులు, ఎగుమతులు పెరుగుతాయి. ఫలితంగా రాష్ట్ర సంపద, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయి. ప్రజలు సుసంపన్నంగా ఉంటే పన్నుల రాబడి కూడా పెరుగుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఆర్థికంగా అత్యంత పటిష్ఠమైన రాష్ట్రంగా తయారైందని ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌' గణాంకాలు తెలుపుతున్నాయి. జీడీపీలో, తలసరి ఆదాయంలో తెలంగాణ దేశ సగటును కూడా అధిగమించింది. ఈ ఏడాది గత ఐదు నెలలుగా రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ఆర్థికంగా ఏమేరకు ప్రతికూల ప్రభావం చూపుతుందనేది ప్రస్తుతం సవాలుగా మారింది.


logo