సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 01:02:46

లాక్‌డౌన్‌ తర్వాత పెరిగిన చోరీలు

లాక్‌డౌన్‌ తర్వాత పెరిగిన చోరీలు

  • గోద్రేజ్‌ లాక్స్‌ హర్‌ఘర్‌ సురక్షిత్‌ నివేదికలోవెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఇండ్లల్లో చోరీలు 65 శాతం పెరిగాయని గోద్రేజ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కరోనా కారణంగా చాలామంది ఉపాధి అవకాశాలకు గండిపడటం, నిరుద్యోగులుగా మారిన వారిలో కొందరు దొంగ మార్గాలు వెతుకడమే చోరీల్లో పెరుగుదలకు కారణంగా తేల్చింది.  ‘హర్‌ ఘర్‌ సురక్షిత్‌ రిపోర్ట్‌-2020-భారత పోలీసు బలగాల భద్రతకు సూచనలు’ సర్వే నివేదికను గోద్రేజ్‌ సంస్థ గోద్రేజ్‌ లాక్స్‌ బిజినెస్‌ హెడ్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్యాంమోత్వాని బుధవారం విడుదల చేశారు. ఇండ్లల్లో చోరీలతోపాటు చిన్నాచితక దొంగతనాలు, వాహనాల చోరీలు కూడా పెరిగినట్టు ఆ నివేదిక తెలిపింది. నివేదికలోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి..

  • లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఇండ్లల్లో చోరీలు65శాతం పెరిగాయి. 
  • ఇండ్ల భద్రత అంశాలపై ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందని 85శాతం మంది పోలీసులు అభిప్రాయపడ్డారు. 
  • లాక్‌డౌన్‌ సమయంలో పోలీసుల పనితీరు మెరుగ్గా ఉన్నట్టు 65శాతం మంది విశ్వసించారని పోలీసులు తెలిపారు. 
  • ఇంట్లో ఒకసారి చోరీ జరిగిన తర్వాతే ఇంటి భద్రత గు రించి చర్చించుకుంటున్న వారి సంఖ్య 71శాతం ఉంది.
  • చోరీ జరిగే ప్రమాదం ఉన్నట్టు గమనించినా 64శాతం మంది ఇంటి భద్రత గురించి పట్టించుకోవడం లేదు. 
  • 68శాతం మంది తమ ఇరుగుపొరుగువారిని, వాచ్‌మెన్లు,  ఇండ్లల్లో పనిచేసేవారిని ఇంటి భద్రత అంశంలో నమ్ముతున్నారు. తీరా అదే వారిని ప్రమాదంలోకి నెడుతున్నది. 
  • ఇంటి భద్రత విషయంలో నాణ్యమైన తాళమే ఉత్తమ మా ర్గమని 64శాతం మంది పోలీసులు అభిప్రాయపడ్డారు.
  • చోరీలకు పాల్పడేందుకు ఇండిపెండెంట్‌ ఇండ్లు, ప్రైవేటు అపార్ట్‌మెంట్లను అవకాశంగా దొంగలు భావిస్తున్నారు. 
  • చోరీలు ఎక్కువగా తెల్లవారుజామునే జరుగుతున్నాయి.