బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 02:29:19

సెప్టెంబర్‌కల్లా అదుపులోకి!

సెప్టెంబర్‌కల్లా అదుపులోకి!

  • తిరోగమనంలో కరోనా వైరస్‌
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో తగ్గుతున్న కేసులు
  • కొవిడ్‌ చికిత్సకు పక్క రాష్ర్టాల నుంచి రాక
  • ఆరోగ్యంపై శ్రద్ధ మంచి పరిణామం
  • నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రై‘వేటు’ తప్పదు
  • వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల వెల్లడి
  • దేశంలో పెరిగిన రికవరీ రేటు ఇప్పటివరకు కోలుకున్నవారు 75.92%

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు తగ్గుమఖం పట్టాయని, రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌నాటికి పూర్తి అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నదని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు వివరించారు. పెద్దసంఖ్యలో పరీక్షలుచేయడం, త్వరితగతిన చికిత్స అందించడం వల్ల మరణాల రేటు తక్కువగా నమోదవుతున్నట్టు చెప్పారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. 

మంగళవారం కోఠిలోని డీపీహెచ్‌ కార్యాలయంలో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, వైద్యారోగ్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి సీజనల్‌ వ్యాధుల లక్షణాలు, కరోనా ప్రాథమిక లక్షణాలు ఒకేవిధంగా ఉంటాయని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమలు పెరుగకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, చికిత్స విషయంలో మార్గదర్శకాలు జారీచేసినట్టు పేర్కొన్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యంచేయకుండా సమీప ప్రభుత్వ దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. 

కరోనా సహా ఇతర వ్యాధుల చికిత్సను గ్రామస్థాయివరకు చేరువచేశామన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని, గడిచిన 6 నెలల్లో నియంత్రణ దశకు చేరుకున్నామని, మరికొద్ది రోజుల్లో పూర్తి సాధారణ స్థితికి చేరుతుందని వివరించారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు జాతీయస్థాయి రేటు కన్నా తక్కువగానే ఉన్నదని, వైరస్‌ నివారణకు చర్యలు తీసుకోవడం లేదని చేస్తున్న ప్రచారం బాధాకరమన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి కరోనా చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. ప్రైవేటు దవాఖానల్లోని దాదాపు 50 శాతం పడకల్లో ఏపీ, కర్ణాటక వారున్నట్టు సమాచారం ఉన్నదన్నారు. తెలంగాణలో పడకల కొరత లేదని పునరుద్ఘాటించారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా ఆక్సిజన్‌తో కూడిన పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. 


కరోనాపై వైద్యసిబ్బంది పోరాటం

కరోనాపై వైద్యసిబ్బంది అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అధికారులు చెప్పారు. ఈ పోరులో 2 వేలకు పైగా సిబ్బందికి వైరస్‌ సోకిందని, 8 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. వైద్యుల కృషికి ప్రజల మద్దతు అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన జీవితం అలవాటైందని చెప్పారు. ఇది మంచి పరిణామంగా పేర్కొన్నారు. 

పెద్ద సంఖ్యలో పరీక్షలు

ప్రతి 10 లక్షల మందిలో దేశ సగటును మించి తెలంగాణలో 27,500 టెస్టులు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. గతంలో కంటే రాష్ట్రంలో నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచామని, ప్రస్తుతం రోజుకు 50 వేల పరీక్షలుచేస్తున్నట్టు వివరించారు. ఇప్పటివరకు 10.21 లక్షల పరీక్షలు చేశామని తెలిపారు. ప్రైవేట్‌ దవాఖానలపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రీ ఇన్ఫెక్షన్‌ నిర్ధారణ కాలేదు

రాష్ట్రంలో ఒకటి రెండు రీ ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదయినట్టు తమ దృష్టికి వచ్చిందని ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. వీటిని నిర్ధారించలేమని, లోతుగా పరిశోధనలు జరుగాల్సి ఉన్నదని పేర్కొన్నారు. చికిత్స పూర్తయిన తర్వాత సరిగ్గా పరీక్షించకపోవడం యాంటీబాడీలు తగినన్ని ఉత్పత్తికాకపోవడం, ఉత్పరివర్తనాలు చెందిన వైరస్‌ సోకడం వల్ల రీ ఇన్ఫెక్షన్‌ నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇది ఒకటి రెండు శాతానికి మించదని స్పష్టంచేశారు.


logo