శుక్రవారం 03 జూలై 2020
Telangana - Feb 29, 2020 , 02:17:13

పవర్‌ఫుల్‌ డిమాండ్‌

పవర్‌ఫుల్‌ డిమాండ్‌
 • తెలంగాణలో 13,168 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌
 • ఉమ్మడి ఏపీలో గరిష్ఠ డిమాండ్‌ 13,162 మెగావాట్లే
 • తలసరి వినియోగంలోనూ 1,896 యూనిట్లతో రికార్డు
 • విద్యుత్‌ వాడకంలో దేశంలో రాష్ర్టానికి రెండోస్థానం
 • సొంత రాష్ట్రంలో 43 లక్షలు పెరిగిన కనెక్షన్లు
 • అయినా కోత, లోటు లేకుండా విద్యుత్‌ సరఫరా
 • తలసరి విద్యుత్‌ వినియోగం
 • దేశవ్యాప్తంగా 1,181 యూనిట్లు
 • తెలంగాణలో 1,896 యూనిట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ విద్యుత్‌శాఖ చరిత్రను తిరగరాసింది. గతమెన్నడూ ఎరుగని విధంగా రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 7.52 గంటలకు 13,168 మెగావాట్ల అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌తో సరికొత్త రికార్డును సృష్టించింది. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ మరో ఘనతను సాధించింది. చరిత్రలో తొలిసారి దేశవ్యాప్త సగటును మించి తెలంగాణలో వినియోగం నమోదయింది. ఇంత పెద్దఎత్తున విద్యుత్‌ డిమాండ్‌ ఏర్పడినాఎక్కడా కోత, లోటు లేకుండా విద్యుత్‌ సంస్థలు విద్యుత్‌ సరఫరా చేయగలిగాయి. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ను దాటి రికార్డు

23 జిల్లాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మొదటిసారిగా 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ నమోదయింది. శుక్రవారం తెలంగాణలో అంతకుమించి డిమాండ్‌తో ఆ రికార్డును తిరగరాసింది. శుక్రవారం ఉదయం 7.52 గంటలకు 13,168 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ నమోదయింది. గత ఏడాది ఇదేరోజున గరిష్ఠ డిమాండ్‌ 9,770 మెగావాట్లుగా రికార్డవగా.. ఈ ఏడాది 34 శాతం అధిక డిమాండ్‌ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా  5,661 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ నమోదైంది. నాటితో పోలిస్తే ప్రస్తుతం వచ్చిన డిమాండ్‌ 132.6 శాతం అధికం.


దేశ సగటును మించి వినియోగం

రాష్ట్రంలో  2014లో  47,338 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌వినియోగం జరగగా..  2018-19లో 68,147 మిలియన్‌ యూనిట్లకు చేరింది. ఆరేండ్లలోనే 44 శాతం అధిక విద్యుత్‌ వినియోగమయింది. ఇదే సమయంలో దేశ సగటు 23 శాతంగా మాత్రమే నమోదైంది. విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉండగా.. తమిళనాడు మొదటి, కర్ణాటక మూడోస్థానంలో ఉన్నాయి. 


పెరిగిన తలసరి విద్యుత్‌ వినియోగం

ప్రగతి సూచికలుగా గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్‌ వినియోగం ఒకటి. దేశవ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్‌ వినియోగం 1,181 యూనిట్లు కాగా, తెలంగాణలో ప్రస్తుతం 1,896 యూనిట్లు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్‌ వినియోగం 1,356 యూనిట్లు ఉం డగా, ఆరేండ్లలో 39.82 శాతం పెరిగింది.


డిమాండ్‌ పెరగడానికి కారణాలు

 • తెలంగాణ వచ్చిన తొమ్మిది నెలల్లోనే   సాగుకు 9 గంటల విద్యుత్‌ అందించారు. 2018 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంపుసెట్లకు 24 గంటల విద్యుత్‌ సరఫరా జరుగుతున్నది. 2014 జూన్‌ 2కు ముందు సాగుకు రెండువేల మెగావాట్లకు మించి డిమాండ్‌ ఉండేదికాదు. ఎత్తిపోతలతో కలుపుకొని 6 వేల మెగావాట్ల వరకు డిమాండ్‌ ఏర్పడింది.
 • రాష్ట్రం ఏర్పడేనాటికి 19,02,754 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉంటే, నేడు రాష్ట్రంలో 24,31,056 కనెక్షన్లున్నాయి. 2014లో ఎత్తిపోతల పథకాలకు కేవలం 680 మెగావాట్ల డిమాండ్‌ ఉండగా.. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల ఫలితంగా పంపుహౌస్‌ల నిర్వహణకు ప్రస్తుతం 2,200 మెగావాట్ల వరకు విద్యుత్‌ అవసరమవుతున్నది.  
 • టీఎస్‌ ఐపాస్‌తో కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు పరిశ్రమలకు పవర్‌ హాలిడేలు ప్రకటిస్తే.. నేడు తెలంగాణలో పరిశ్రమలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ నిరంతరాయంగా సరఫరా జరుగుతున్నది.
 • రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామికరంగాలతోపాటు పట్టణీకరణ శరవేగంగా జరుగుతుండటం వల్ల వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు పెరిగాయి. కొత్త విద్యుత్‌ కనెక్షన్ల వృద్ధిరేటు అధికంగా ఉన్నది. రాష్ట్రం ఏర్పడేనాటికి విద్యుత్‌ కనెక్షన్లు 1,11,19,990 ఉండగా.. నేడు రాష్ట్రంలో 1,54,14,451 కనెక్షన్లు ఉన్నాయి. అంటే దాదాపు 43 లక్షలు పెరిగాయి. తెలంగాణ వచ్చినప్పటితో పోలిస్తే ఇది 38.61 శాతం అధికం. 


కేసీఆర్‌ మార్గదర్శకం, సిబ్బంది కృషే కారణం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్న పరిస్థితి నుంచి ఇంత గొప్పగా తయారుకావడం  వెనుక  సీఎం కేసీఆర్‌ మార్గదర్శనం, పర్యవేక్షణ, విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల అవిరళ కృషి ఉన్నది. ఉమ్మడి ఏపీలో నమోదైన డిమాండ్‌కు మించి తెలంగాణలో డిమాండ్‌ ఏర్పడటం, దానికి అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేయగలగడం సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తున్నది. ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు, ఉద్యోగులకు అందిస్తున్న ప్రోత్సాహం, ఆర్థిక సహకారంతోనే ఈ మార్పు సాధ్యమయింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తిచేసి, తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చాలనే ముఖ్యమంత్రి కలను నిజం చేసేందుకు ఇంజినీర్లు, అధికారులు, సిబ్బంది, కార్మికులంతా బృందంగా పనిచేస్తున్నాం.

- దేవులపల్లి ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ


logo