మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 03:54:14

నిర్వహణ నిధుల ఎత్తిపోత

నిర్వహణ నిధుల ఎత్తిపోత
  • సాగునీటి బడ్జెట్‌లో పెరిగిన నిర్వహణ పద్దు
  • రుణాల ద్వారా మరో రూ.20 వేల కోట్ల సమీకరణ
  • పెట్టుబడి వ్యయానికి అనుగుణంగా ప్రాజెక్టుల ఫలాలు
  • నీటిపారుదలరంగానికి రూ.11,053.55 కోట్లు


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సాగునీటి ప్రాజెక్టులపై వెచ్చించే మొత్తం ఖర్చుకిందకు రాదు.. అది భావితరాల కోసం మనం పెట్టేపెట్టుబడి వ్యయమంటూ సీఎం కేసీఆర్‌ చెప్పే మాటలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం గత ఆరేండ్లుగా సాగునీటిరంగానికి పెద్దపీట వేస్తూ వస్తున్నది. సంక్షేమంతోపాటు, ఇతరరంగాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం తగ్గకుండా నిధులను సమీకరిస్తూనే ఉన్నది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులు పూర్తికావడంతోపాటు, మరికొన్ని చివరిదశలో ఉండటంతో వాటి నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించింది. కీలకమైన కాళేశ్వరం ఎత్తిపోతలు సహా పలు ప్రాజెక్టులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వాటి నిర్వహణలో ఇబ్బందులు ఎదురవకుండా ముందుచూపు ప్రదర్శించింది. సాగునీటిరంగ కేటాయింపుల్లో తొలిసారిగా ప్రగతిపద్దు కంటే నిర్వహణపద్దుకే అధిక ప్రాధాన్యమిచ్చింది. మరోవైపు ఆర్థికసంస్థల ద్వారా రుణాల సమీకరణతో ప్రాజెక్టు పనులను కొనసాగించాలని ప్రణాళిక రూపొందించింది. 


ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ. 11,053.55 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.7,446.97 కోట్లు ఉండగా.. ప్రగతి పద్దు కింద రూ.3,606.58 కోట్లుగా చూపింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, భక్త రామదాసు, దేవాదుల, ఏఎమ్మార్పీతోపాటు పలు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటివిడుదల కొనసాగుతున్నది. గతేడాది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కూడా అందుబాటులోకి వచ్చి రైతులకు ఫలాలు అందిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సీతారామ తర్వాత పాలమూరు-రంగారెడ్డి, డిండి తదితర ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల నిర్వహణ అత్యంత కీలకంగా మారనున్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని సాగునీటి కేటాయింపుల్లో ప్రభుత్వం నిర్వహణ పద్దుకు ప్రాధాన్యమిచ్చింది. 


రుణాలతో ‘భారీ’ మొత్తమే..

తాజా బడ్జెట్‌లో సాగునీటిరంగానికి రూ.11,053.55 కోట్లు కేటాయింపులు చేపట్టగా... 2020-21 ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్పొరేషన్ల రుణాల ద్వారా మరో రూ.20 వేల కోట్ల వరకు నిధుల సమీకరణకు నీటిపారుదలశాఖ ప్రణాళిక రూపొందించినట్టు తెలిసింది.  వాస్తవంగా 2019-20 బడ్జెట్‌లో సాగునీటిరంగానికి ప్రభుత్వం రూ.8,476.17 కోట్లు కేటాయించింది. కానీ, కార్పొరేషన్ల ద్వారా ఈ ఏడాది జనవరి వరకే పది వేలకోట్ల రూపాయలకుపైగా రుణాలను సమీకరించింది. బడ్జెట్‌ కేటాయింపుల్లోని రూ.8079.83 కోట్లల్లో రూ.6670.05 కోట్లు ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులకే వెచ్చించగా.. రుణాల ద్వారా రీడిజైనింగ్‌ ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యమిచ్చింది. 


అటు బడ్జెట్‌, ఇటు రుణాలను సమతూకం చేసుకుంటూ ముం దుకెళుతుండటంతో ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వచ్చి సాగుభూముల విస్తీ ర్ణం నానాటికీ పెరుగుతున్నది. ఈ ఏడాది కూ డా సేకరించిన రుణాలతో ప్రధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా మూ డోటీఎంసీ తరలింపునకు పనులు చేపట్టడంతోపాటు, మల్లన్నసాగర్‌ తదితర రిజర్వాయర్లు కూడా పూర్తి చేయాల్సి ఉన్నది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.13వేల నుంచి 15 వేలకోట్ల మేర రుణా లు తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి పథకం ద్వారా త్వరితగతిన ఒక టీఎంసీ తరలింపు లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఇలా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన కార్పొరేషన్లద్వారా మరో రూ.5వేల కోట్ల వరకు రుణాలను సేకరించాలని చూస్తున్నారు. 
logo
>>>>>>