మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:46:56

నిండుగా ప్రాణహిత

నిండుగా ప్రాణహిత

  • గోదావరిలో పెరిగిన ప్రవాహం.. ఎస్సారెస్పీకి 9,643 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్‌: తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదికి వరద వచ్చి చేరుతున్నది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి సమీపంలో అంతర్రాష్ట్ర వంతెన వద్ద నిండుగా ప్రవహిస్తున్నది. ఇన్నాళ్లూ నిలకడగా ఉన్న ప్రాణహిత నదిలోకి భారీగా వరద రావడంతో జలకళ సంతరించుకున్నది. మంచిర్యాల జిల్లా దేవులవాడ గ్రామ సమీపంలోని త్రివేణి సంగమం వద్ద గోదావరి నదిలో కలిసి లక్ష్మి బరాజ్‌లోకి నీరు వెళ్తున్నది. ఇదిలావుంటే నిజామాబాద్‌ జిల్లా కందకుర్తి వద్ద కూడా గోదావరి ప్రవాహం ఆశాజనకంగా ఉన్నది. ములుగు జిల్లా పేరూరు వద్ద గోదావరిలో 80వేల పైచిలుకు క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. 

ఎస్సారెస్పీకి 9,643 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ఆశాజనకంగా ఉన్నది. గత ఏడాది ఇదే రోజు ఎలాంటి వరద లేకపోగా ఈ సారి ఏకంగా 9,643 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3.150 టీఎంసీల నీరు వచ్చింది. ఈ ప్రాజెక్టు నీటిమట్టం 1,091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి 1,071.90 అడుగుల (32.912 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉన్నది. కాగా 742 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.  కాగా కడెంకు వెయ్యికిపైగా క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 457 క్యూసెక్కుల వరద వస్తున్నది. 

ఆల్మట్టి, నారాయణపూర్‌లోకి వరద

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణాబేసిన్‌లోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. శనివారం ఆల్మట్టికి 74 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ఈ జలాశయం 129.72 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వకుగాను 92.45 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎగువ నుంచి కూడా వరద వస్తుండటంతో 21,130 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 37.64 టీఎంసీలకుగాను ప్రస్తుతం 29.88 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ  ఉన్నది. ఇన్‌ఫ్లో 27,756 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 25 క్యూసెక్కులు నమోదైంది. తుంగభద్రకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శనివారం ఇన్‌ఫ్లో 34,274 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 302 క్యూసెక్కులుగా నమోదైంది. 100.86 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ డ్యాంలో ప్రస్తుతం 18.274 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలకుగాను ప్రస్తుతం 7.778 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో 1,037 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,488 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం నిలకడగా ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 814.70 అడుగులు మేర నీరు నిల్వ ఉన్నది. 


logo