ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 01:48:51

రోజుకు 2 కోట్ల గుడ్లు తింటున్నారు

రోజుకు 2 కోట్ల గుడ్లు తింటున్నారు

దేశంలో కోడిగుడ్ల వినియోగంలో తెలంగాణ మేటిగా ఉన్నది. లాక్‌డౌన్‌కు ముందు.. రోజుకు 1.8 కోట్ల గుడ్లను వినియోగించగా, ఇప్పుడు 2 కోట్లకు పెరిగింది. తలసరి వినియోగంలో దేశంలోనే రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. ఐసీఎమ్మార్‌, ఎన్‌ఐఎన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో ఏటా తలసరి గుడ్ల వినియోగం 180గా ఉన్నది. లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలో 3.5 కోట్ల నుంచి 3.7 కోట్ల గుడ్లు ఉత్పత్తికాగా, ఇప్పుడు 3 కోట్లకు పడిపోయింది.

  • రోజుకు 2 కోట్ల గుడ్లు తింటున్నాం
  • గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వినియోగం
  • హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గుదల
  • తలసరి వినియోగంలో మనమే టాప్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు అందించే ఆహారం.. రోగనిరోధకశక్తిని పెంచే కోడిగుడ్ల వినియోగం రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్నది. లాక్‌డౌన్‌కు ముందు.. రోజుకు సగటున 1.8 కోట్లుగా ఉన్న గుడ్ల వినియోగం ఇప్పుడు 2 కోట్లకు చేరింది. లాక్‌డౌన్‌ తర్వాత పట్టణాల్లో కంటే గ్రామాల్లో గుడ్లను ఆహారంగా తీసుకునేవారు ఎక్కువయ్యారు. పట్టణాలు వదిలి గ్రామాలకు వెళ్లినవారిలో చాలామంది అక్కడే ఉండిపోవడంతో గిరాకీ పెరగడానికి ప్రధాన కారణమని నెక్‌ (నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ) ప్రతినిధులు చెప్తున్నారు.

జిల్లాల్లోనే కోటి గుడ్లు

గతంలో హైదరాబాద్‌లో రోజుకు 70 లక్షల గుడ్లు తింటే, ఇప్పుడు 60 లక్షలకు తగ్గింది. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, నల్లగొండ జిల్లాల్లో రోజుకు కోటి గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, అవి స్థానిక గ్రామీణ అవసరాలకే సరిపోతున్నాయి. అంతకుముందు ఈ జిల్లాల్లో 50 లక్షల నుంచి 60 లక్షలు గడ్లు స్థానికంగా విక్రయించి, మిగిలినవి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలకు ఎగుమతిచేసేవారు. జూన్‌, జూలై నుంచి డిమాండ్‌ పెరుగడంతో ఎగుమతులు తగ్గిపోయాయి.  

తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన వినియోగం

అన్ని రంగాలకు కుదేలుచేసిన కరోనా మహమ్మారి పౌల్ట్రీని కూడా వదల్లేదు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కోళ్ల పరిశ్రమ ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్నది. డిమాండ్‌కు సరిపడా మాంసం, గుడ్లను అందించగలుగుతున్నా.. ఉత్పత్తిలో మాత్రం కాస్త వెనుకబడే ఉన్నది. కరోనాకు ముందు రాష్ట్రంలో రోజుకు 3.5 కోట్ల నుంచి 3.7 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయితే ఇందులో 1.80 కోట్లు స్థానిక అవసరాలకు, 1.70 కోట్లు ఇతర రాష్ర్టాలకు సరఫరా అయ్యేవి. ఇప్పుడు కోళ్ల పెంపకం తగ్గడంతో గుడ్ల ఉత్పత్తి 3 కోట్లకు తగ్గింది. ఇందులో కోటి గుడ్లు మాత్రమే ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. తలసరి గుడ్ల వినియోగంలో దేశంలోనే తెలంగాణ ముందువరుసలో నిలిచింది. ఐసీఎమ్మార్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌), ఎన్‌ఐఎన్‌ (జాతీయ పోషకాహార సంస్థ) మార్గదర్శకాల ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరూ ఏటా 180 గుడ్లు తినాలి. దానికి అనుగుణంగా తెలంగాణలో ఏటా తలసరి గుడ్ల వినియోగం 180గా ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో ఏపీ, తమిళనాడు నిలువగా, యూపీ, రాజస్థాన్‌లలో తలసరి వినియోగం చాలా తక్కువగా ఉన్నది.


logo