శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 17:58:59

పనుల్లో వేగం పెంచండి : మంత్రి సత్యవతి రాథోడ్

పనుల్లో వేగం పెంచండి : మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ : గిరిజన సంక్షేమ శాఖ అన్ని అంశాల్లో సమర్థవంతమైన శాఖగా గుర్తింపు తెచ్చుకునేలా పని చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజన శాఖ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై ఆ శాఖ కమిషనర్, కార్యదర్శి  క్రిస్టినా జడ్ చోంగ్తుతో కలిసి దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో సమీక్ష నిర్వహించారు. గిరిజనుల కోసం జరిగే పనుల్లో జాప్యత, నిర్లక్ష్యం ఉండకూడదని, గడువులోపు ఇంజినీరింగ్ పనులు నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. లేదంటే తప్పు ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు. 

ఇప్పటి వరకు ఎలా పనిచేసినా ఇకపై మాత్రం కచ్చితంగా పనుల్లో వేగం పెరగాలని, పెండింగ్ పనులన్ని నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. 2016లో మంజూరు అయిన పనులు ఇంకా కొనసాగుతున్నాయని, అందువల్లే గిరిజన శాఖ ఇంజినీరింగ్ విభాగం పట్ల కొంత దురభిప్రాయం నెలకొందని, దీనిని తొలగించుకునే విధంగా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గిరిజన శాఖ పనులు ఆలస్యమవుతాయనే కారణంతో ఇటీవల దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన పనులు ఇతర శాఖలకు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పనులు చేయాలన్నారు. 

అనేక శాఖలలో పనులు జరుగుతన్నా నిధులు విడుదల కాలేదని, గిరిజనుల కోసం జరిగే పనులు ఆగొద్దన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన వెంటనే నిధులు ఇస్తున్నారని, కావున ఏజెన్సీల వెంట పడి పనులు పూర్తి చేయించాలన్నారు. జిల్లాల్లో రోడ్లు, గిరిజన భవనాలు, విద్యాలయాల భవనాల నిర్మాణంలో ఏవైనా సమస్యలు వస్తే వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారులు, కలెక్టర్లతో సంప్రదించి పరిష్కారం అయ్యేటట్లు చొరవ ప్రదర్శించాలన్నారు. మీ స్థాయిలో కాకపోతే సెక్రటరీ దృష్టికి, లేదా నా దృష్టికి తీసుకొస్తే మా స్థాయిలో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. logo