గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:18:16

సాటిలేని రివర్స్‌ పంపింగ్‌

సాటిలేని రివర్స్‌ పంపింగ్‌

  • దక్షిణాది గ్రిడ్‌కు ఊపిరులు శ్రీశైలం, సాగర్‌  l ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్‌చేస్తున్న జల విద్యుత్‌ కేంద్రాలు
  • దక్షిణాది గ్రిడ్‌ను అడుగడుగునా రక్షణ  l దేశంలోనే సమర్థంగా పనిచేస్తున్న హైడల్‌ పవర్‌ స్టేషన్లు
  • స్వరాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా రివర్స్‌పంపింగ్‌ విధానం

కరోనాపై ముందుండి పోరాడుతున్నవారికి ఏప్రిల్‌ 5 రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దేశవ్యాప్తంగా విద్యుద్దీపాలు ఆర్పివేసి సంఘీభావం తెలిపిన సంగతి గుర్తుందా? ఆ రోజు లైట్లను ఆర్పివేయడంవల్ల దక్షిణాదిగ్రిడ్‌ కుప్పకూలకుండా  నాగార్జునసాగర్‌, శ్రీశైలం  జల విద్యుత్‌ కేంద్రాలు ఆదుకున్నాయి. రెండు జల విద్యుత్‌ కేంద్రాల్లో ఉన్న రివర్స్‌ పంపింగ్‌ 

విధానమే ఆనాడు శ్రీరామరక్షగా నిలిచింది. అవే సమర్థంగా పనిచేయకపోయి ఉంటే దక్షిణాది రాష్ర్టాలు కొన్ని రోజులపాటు అంధకారంలో మగ్గిపోవాల్సి వచ్చేది.  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యుద్దీపాలన్నింటినీ ఒక్కసారిగా ఆర్పివేసినా.. ఆన్‌చేసినా విద్యుత్‌ ఫ్రీక్వెన్సీలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. అదే దేశమంతటా ఒకేసారి జరిగితే గ్రిడ్‌ వ్యవస్థలే కుప్పకూలుతాయి. ఏప్రిల్‌ 5న లైట్లు ఆర్పివేసినా.. ఒక్కసారిగా వేసినప్పటికీ ఫ్రీక్వెన్సీలో తేడాలు రాకుండా నాగార్జునసాగర్‌, శ్రీశైలంలోని జలవిద్యుత్‌ కేంద్రాల్లోని రివర్స్‌ పంపింగ్‌ వ్యవస్థ ఎంతగానో దోహదపడింది. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు సారథ్యంలో అధికారులు సాగర్‌, శ్రీశైలంలో జలవిద్యుత్‌ను ఉత్పత్తిచేసే మోటర్లను రివర్స్‌ పంప్‌ మోడ్‌లో నడిపి దక్షిణాది గ్రిడ్‌లో ఇబ్బందులు రాకుండా కాపాడారు. రివర్స్‌ పంప్‌ మోడ్‌తో పంపులు వెనక్కు తిరుగుతాయి. దీంతో నదిలోని నీటిని, మోటర్లు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తాయి. ఒక్కసారిగా లైట్లు వేయడంతో డిమాండ్‌ పెరిగి ఫ్రీక్వెన్సీ పడిపోతుంది. అప్పుడు విద్యుదుత్పత్తి ప్రారంభిస్తారు. వాస్తవానికి విద్యుత్‌ ఫ్రీక్వెన్సీ ఎప్పుడూ 50గా ఉండేలా చూసుకోవాలి. ఒక్కసారిగా డిమాండ్‌ పడిపోయినా, పెరిగినా ఫ్రీక్వెన్సీలో తేడాలు రాకుండా రివర్స్‌ పంపింగ్‌ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది.

డిమాండ్‌ను బట్టి పంపింగ్‌

వాస్తవానికి ఉదయం 6 నుంచి 10 గంటలు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ గరిష్ఠ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అందుబాటులోఉన్న థర్మల్‌, జల విద్యుదుత్పత్తి కేంద్రాలన్నింటినీ నడిపిస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు కనిష్ఠ డిమాండ్‌ సమయంలో విద్యుదుత్పత్తి కేంద్రాలను బ్యాక్‌డౌన్‌చేస్తారు. విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉండే సమయంలో బహిరంగ మార్కెట్‌లో వి ద్యుత్‌ ధర కూడా అధికంగా ఉంటుంది. డిమాం డ్‌ తక్కువగా ఉండే సమయంలో చౌకగా లభిస్తుంది. చౌకగా విద్యుత్‌ లభించే సమయంలో విద్యుత్‌ను కొనుగోలుచేసుకుని నిల్వ చేస్తుంటారు. ఇందుకోసం రివర్స్‌పంపింగ్‌ మోడ్‌ను ఉపయోగిస్తారు. సాగర్‌, శ్రీశైలంలో ఉన్న ఈ విధానం వల్ల రోజుకు కనీసం రూ.2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఆదా అవుతున్నది. 

మనదే రికార్డు

జలవిద్యుత్‌ కేంద్రాల్లో రివర్స్‌ పంపింగ్‌ వ్యవస్థలు దేశంలో తక్కువగా ఉన్నాయి. సాగర్‌లో ఏడు పంప్‌ల ద్వారా 705.60 మెగావాట్లు, శ్రీశైలంలో 6 యూనిట్ల ద్వారా 900 మెగావాట్ల సామర్థ్యంతో రివర్స్‌ పంపింగ్‌కు అవకాశమున్నది. అలాగే మహారాష్ట్రలో 400 మెగావాట్లు, తమిళనాడులో 400 మెగావాట్లు, పశ్చిమబెంగాల్‌లో 900 మెగావాట్ల సామర్థ్యంతో రివర్స్‌ పంపింగ్‌ వ్యవస్థలున్నాయి. కానీ, వీటిల్లో అత్యంత సమర్థంగా గ్రిడ్‌ డిమాండ్‌, సైప్లె మధ్య బ్యాలెన్సింగ్‌ చేసేది మాత్రం నాగార్జునసాగర్‌ శ్రీశైలంలోని జల విద్యుత్‌ కేంద్రాలు మాత్రమే. సాగర్‌, శ్రీశైలం విద్యుదుత్పత్తి కేంద్రాలను ప్రారంభించినప్పుడే రివర్స్‌ పంపింగ్‌ను ఏర్పాటుచేసినప్పటికీ.. నేటికీ ఆ వ్యవస్థ విజయవంతంగా నడుస్తున్నది. దీంతో దక్షిణాది గ్రిడ్‌లో ఎలాంటి ఒడిదుడుకులు తలెత్తకుండా విద్యుత్‌ సరఫరా జరుగుతున్నది. గ్రిడ్‌ పరిధిలో విద్యుత్‌ ఫ్రీక్వెన్సీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నిలకడగా ఉంచేలా.. అదేసమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా సాగర్‌, శ్రీశైలంలోని రివర్స్‌ పంపింగ్‌ను ఉపయోగిస్తుండటం తెలంగాణకు మాత్రమే ఉన్న అవకాశం. ఉమ్మడి రాష్ట్రంలో అంతగా ఉపయోగంలోకి తీసుకురాని రివర్స్‌ పంపింగ్‌ విధానాన్ని తెలంగాణ వచ్చాక అధికారులు పక్కా ప్రణాళికతో వినియోగిస్తున్నారు.logo