బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 20:01:52

యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు

యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు


యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఆలయంలో శతఘటాభిషేకం నిర్వహించారు. 108 కలశాలలోకి ఆవాహనం చేసిన దేవతలు, మూలికలు, వివిధ రకాల ఔషధాలతో కలిపి మంత్రించిన జలంతో శ్రీవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హవనంలో వచ్చిన హవిశ్సును శ్రీవారికి అర్పించారు. 

ప్రభాత వేళ వందలాది మంది భక్తులు భౌతిక దూరం పాటిస్తూ యాదాద్రి కొండ చుట్టు గిరిప్రదక్షిణ నిర్వహించారు. భజనలు చేస్తూ కొండ చుట్టు ప్రదక్షిణ నిర్వహించిన అనంతరం కొండ కింద ఉన్న వైకుంఠ ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు నిర్వహించి.. ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతోపాటు అష్టోత్తర పూజలు ఆన్‌లైన్‌లో కోరుకున్న భక్తుల కోసం నిర్వహించారు. 

సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. స్థానాచార్యులు రఘువాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నర్సింహమూర్తి, ఏఈవోలు మేడి శివకుమార్‌, దోర్భల భాస్కరశర్మ, వేముల రామ్మోహన్‌, ఆకునూరి చంద్రశేఖర్‌, పర్యవేక్షకులు వేముల వెంకటేష్‌, ఎస్‌ వెంకటేశ్వర్‌రావు, రాజన్‌బాబు, గజవెల్లి రమేష్‌బాబు, గజవెల్లి రఘు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకొన్నారు. 


logo