గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:46:48

200 కోట్లకు టోకరా

200 కోట్లకు టోకరా

  • రియల్‌ ఎస్టేట్‌, ఆహార పదార్థాల ప్యాకింగ్‌, విక్రయం పేరిట దగా
  • ఐదు రాష్ర్టాల్లో బాధితులు 
  • పోలీసుల అదుపులో స్కీం ప్రధాన నిర్వాహకుడు  

కామారెడ్డి: స్కీం పేరిట 200 కోట్లకు టోకరా వేసిన ఘరానా మోసగాడిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌ కొందరితో కలిసి కామారెడ్డి పట్టణంలోని రియల్‌ఎస్టేట్‌ సంస్థ, ఆహార పదార్థాల ప్యాకింగ్‌, విక్రయం పేరిట స్కీం ప్రారంభించాడు. సంస్థలో రూ.30 వేలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.10 వేలు చొప్పున 10 నెలల పాటు లక్ష రూపాయలు చెల్లిస్తామని నమ్మించి భారీగా వసూలు చేశారు. కాగా లాక్‌డౌన్‌ పేరుతో నిర్వాహకులు తమ కార్యాలయాన్ని మూసివేయగా, హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  

రూ.30 వేలు చెల్లిస్తే రూ.లక్ష 

ఇస్మాయిల్‌ మరికొందరితో కలిసి కామారెడ్డి పట్టణంలోని స్నేహపూరి కాలనీలో మూడేండ్ల క్రితం రియల్‌ఎస్టేట్‌ సంస్థ, ఆహార పదార్థాల ప్యాకింగ్‌, విక్రయం పేరిట స్కీం ప్రారంభించారు. రూ.30 వేలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.10 వేలు చొప్పున 10 నెలలపాటు లక్ష రూపాయలు చెల్లిస్తామని నమ్మించారు. కామారెడ్డితోపాటు కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, సిద్దిపేట, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ర్టాల్లో సైతం ఏజెంట్లను నియమించుకున్నారు. అమాయక ప్రజలను మాయ మాటలతో సంస్థలో సభ్యులుగా చేర్చుకొని పెట్టుబడి పెట్టించారు. ఇలా సుమారు ఎనిమిది వేల మంది నుంచి రూ.30 వేల నుంచి మొదలుకొని లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టించారు. ఇలా సుమారు రూ.200 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన డబ్బులు తిరిగి చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. కాగా, యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు స్కీం ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.


logo