శనివారం 04 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 01:42:52

వ్యవసాయంలో రోల్‌మోడల్‌

వ్యవసాయంలో రోల్‌మోడల్‌

  • దేశానికి దిక్సూచిలా తెలంగాణ పథకాలు
  • పుడమి తల్లికి పచ్చల హారం..
  • 147.65 లక్షల నుంచి 179.65 లక్షల ఎకరాలకు సాగువిస్తీర్ణం
  • విపత్కర పరిస్థితుల్లోనూ  విజయవంతంగా కొనుగోళ్లు

తెలంగాణలో వ్యవసాయం వర్షాధారితం.. వర్షం కోసం మొగులువైపు.. కరెంటు కోసం బుగ్గవైపు చూడాల్సిన దుస్థితి.. అడుగడుగునా బోర్లు అయినా అందని నీళ్లు.. కరెంటు. తెలంగాణలో వ్యవసాయం దండుగ అని నవ్వి‘నోళ్లు’.. ఆరేండ్ల స్వరాష్ట్ర పాలనలో పండుగలా మారడం చూసి నోళ్లెళ్లబెడుతున్నారు. 2013-14లో 147.65 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. 2019-20 నాటికి అది 179.65 లక్షల ఎకరాలకు పెరిగింది. దిగుబడుల్లోనూ తెలంగాణ కొత్త రికార్డులను సృష్టిస్తున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో వ్యవసాయం రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్రం ధాన్యరాశులతో కళకళలాడుతున్నది. వరి, మక్కజొన్నతోపాటు అన్నిరకాల పంటలు దిగుబడుల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర అవసరాలకనుగుణంగా ప్రాజెక్టులను రీడిజైన్‌ చేసిన సీఎం కేసీఆర్‌.. గత ఐదు వార్షిక బడ్జెట్లలో సరాసరి ఏటా రూ.25వేల కోట్లు కేటాయించి వాటిని పూర్తిచేయించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ అందిస్తూ రైతులకు అర్ధరాత్రి బాధల నుంచి విముక్తి కలిగించారు. పంట పెట్టుబడి కింద ఏటా ఎకరానికి రూ.10వేలు అందిస్తున్నది.  వ్యవసాయరంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ దేశానికే దిక్చూచిగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను యావత్‌ దేశం వేనోళ్ల కొనియాడుతుండటమే దీనికి నిదర్శనం. రైతుబంధు, రైతుబీమా పథకాలు, భూరికార్డుల ప్రక్షాళన , రైతుబంధు సమితుల ఏర్పాటు తదితర కార్యక్రమాల ద్వారా తెలంగాణ రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొల్పింది.

జాతీయ అజెండాగా రైతుబంధు

వ్యవసాయం పెట్టుబడికోసం రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన సీఎం కేసీఆర్‌.. దానికి తరుణోపాయంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎకరానికి రూ.10 వేల పంటసాయం అందిస్తున్న ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. కేంద్రప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరిట ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నది. రైతుపేరిట స్వయంగా ప్రీమియం చెల్లించి రైతుబీమా పథకాన్ని తీసుకువచ్చింది. రైతు ఏ కారణంగానైనా చనిపోతే వారికుటుంబాన్ని ఆదుకునేందుకు ఐదు లక్షల బీమా అందిస్తున్నది. ఈ పథకం 2018 ఆగస్టు 1న అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుమారు 11,576 మంది రైతు కుటుంబాలకు రైతుబంధు పథకం కింద సహాయం అందింది. రుణమాఫీతోనూ ఊరట కల్పిస్తున్నది.

ఆరేండ్లలో రికార్డు స్థాయి దిగుబడులు

రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏటికేడు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. వరిసాగు, ఉత్పాదకత, దిగుబడులు గరిష్ఠస్థాయికి చేరుకొన్నాయి. 2013-14లో 49.63 లక్షల ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణం, 69.01లక్షల టన్నుల దిగుబడి ఉండగా 2019-20 నాటికి సాగు విస్తీర్ణం 80.51లక్షల ఎకరాలకు, దిగుబడి 193.61లక్షల టన్నులకు పెరిగింది. డిమాండ్‌ ఉన్న పంటల సాగుతో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే సంకల్పంతో ఈ ఏడాది వానకాలం సీజన్‌ నుంచి ‘సమగ్ర వ్యవసాయ విధానాన్ని’అమలు చేసేందుకు సంకల్పించింది.logo