గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 01:59:58

సేద్యానికి ఆవిష్కరణలు

సేద్యానికి ఆవిష్కరణలు

  • అందుకు కృషిచేసే వారికి మద్దతు
  • ద్వితీయ నగరాలకు టీ హబ్‌ సేవలు
  • దేశ స్టార్టప్‌ సిస్టమ్‌లో టీహబ్‌ ముద్ర
  • ఇన్నోవేషన్‌ సెల్‌, టీ హబ్‌పై సమీక్షలో 
  • ఐటీ  మంత్రి  కే తారకరామారావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో ఆ రంగంలో ఆవిష్కరణలు మరిన్ని జరుగాల్సిన అవసరం ఉన్నదని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గ్రామీణ, వ్యవసాయ ఆవిష్కరణలకు కృషిచేస్తున్నవారికి అవసరమైన మద్దతు అందిస్తామని చెప్పారు. ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీని విస్తరించే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు టీహబ్‌ సేవలను విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌, టీ హబ్‌పై మంగళవారం మంత్రి కేటీఆర్‌ మొదటిపేజీ తరువాయి...

సమీక్ష నిర్వహించారు. టీ-హబ్‌ ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను సీఈవో రవినారాయణ్‌ వివరించారు. ప్రస్తుత, భవిష్యత్‌ కార్యక్రమాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఐదేండ్లుగా దేశ స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌లో టీ హబ్‌ తనదైన ముద్ర వేయగలిగిందని అన్నారు. టీ-హబ్‌ ద్వారా ఔత్సాహికులకు అందిస్తున్న అద్భుతసేవలను ద్వితీయశ్రేణి నగరాలకూ విస్తరించాలని సూచించారు. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల్లోనూ కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌, టీహబ్‌, వీ హబ్‌, టీ వర్క్స్‌, రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, టాస్క్‌ తదితర ఆర్గనైజేషన్లతో తెలంగాణలో మంచి ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పడిందన్నారు. 

పాఠశాల విద్యార్థులకు అండగా..

తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమాలు గ్రామీణ యువత, విద్యార్థుల ఆలోచనలను ప్రోత్సహించేలా కొనసాగించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. పాఠశాల విద్యార్థులకు, వారి ఇన్నోవేటివ్‌ ఆలోచనలకు అండగా నిలిచేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందుకోసం విద్యాశాఖతో కలిసి పనిచేయాలని చెప్పారు. టీ హబ్‌ ద్వారా టెక్‌ ఇన్నోవేషన్‌తోపాటు రూరల్‌, సోషల్‌ ఇన్నోవేషన్‌ పై దృష్టి సారించాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోఉన్న స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌, టీ హబ్‌, టీ వర్క్స్‌, వీ హబ్‌ తదితర సంస్థల ద్వారా ఆయారంగాల్లో రాబోయే ఆవిష్కరణలకు సహకారమందించాలని ఆదేశించారు. ముఖ్యమైన రంగాల్లో ఇన్నోవేషన్‌ మరింత ప్రోత్సహించేందుకు, ఔత్సాహికులు తమ ఆలోచనలు, ఆవిష్కరణల ప్రదర్శనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు.


logo