మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 03:15:46

ఖజానాకు బాబ్జీ కన్నం!

ఖజానాకు బాబ్జీ కన్నం!

  • అడ్డగోలు దందాలో ఘనుడు
  • సప్లయర్‌ నుంచి ఓనర్‌ అవతారం
  • అధికారులకు 30%.. అతనికి 400% కమీషన్‌
  • మూడేండ్లలో ఓమ్నీమెడీ, దాని షెల్‌ కంపెనీలకు దాదాపు రూ.203 కోట్లు వెళ్లినట్టు ఆధారాలు
  • ఓమ్నీమెడీ ఎండీ శ్రీహరిబాబు బాగోతాలెన్నో
  • ఏసీబీ దర్యాప్తులో ఒక్కొక్కటి బయటకు..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాసుకో.. దోచుకో..! అందిన కాడికి అప్పనంగా మింగేద్దాం.. ఇదీ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) స్కాంలో కొన్ని ప్రైవేటు ఫార్మా కంపెనీల వ్యవహారం. మొత్తం స్కాంలో సింహభాగం ఓమ్నిమెడీ ఎండీ శ్రీహరిబాబు అలియాస్‌ బాజ్జీకే చెందినట్టు ఇప్పటివరకు ఏసీబీ దర్యాప్తులో వెల్లడవుతున్నది. బాబ్జీ ‘పెక్యునరీ గెయిన్‌'లో పెద్దన్న మాదిరిగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. పెక్యునరీ గెయిన్‌ అంటే ప్రభుత్వ ఖజానాను అధికారుల సహకారంతో ప్రైవేటు వ్యక్తులు లేదా కంపెనీలు కొల్లగొట్టే వ్యవహారం అన్నమాట. ఇన్వెస్టిగేషన్‌ భాషలో అధికారులు దీన్ని పెక్యునరీ గెయిన్‌గా వ్యవహరిస్తుంటారు.  

దశాబ్దాలుగా శ్రీహరి దందా

తొలుత కంపెనీల నుంచి ఔషధాలు కొని జిల్లాల్లోని దవాఖానలకు చేరవేసే సరఫరాదారుడిగా ఈ వ్యాపారంలోకి వచ్చిన శ్రీహరిబాబు.. ఆ తర్వాత సొంతంగా కంపెనీలు ప్రారంభించాడు. 1998 నుంచి ఉమ్మడి ఏపీలో పలు జిల్లాలకు మందులు సరఫరాచేస్తూ అధికారులతో పరిచయాలు పెంచుకున్నాడు. కరీంనగర్‌ జిల్లా దవాఖానలో వెలుగుచూసిన మందుల దందాలో ఏసీబీకి పట్టుబడిన బాబ్జీ.. తన పలుకుబడితో 2007లో చార్జిషీట్‌లో నుంచి తన పేరును తీయించుకున్నట్టు సమాచారం. క్రమంగా ఐఎంఎస్‌లో అన్ని స్థాయిల్లోని అవినీతి అధికారులతో అంటకాగుతూ దోపిడీకి తెరతీసినట్టు తెలుస్తున్నది. ఒకదశలో డైరెక్టర్‌స్థానంలో ఎవరు ఉండాలన్నది నిర్ణయించే రేంజ్‌లో బాబ్జీ హవా కొనసాగినట్టు ప్రచారం ఉన్నది. 

అధికారులకు కొంత.. బాబ్జీకి మిగిలినదంతా 

ఐఎంఎస్‌ అవినితి అధికారులు, కొన్ని ఫార్మాకంపెనీలు ప్రభుత్వ ఖజానాను పప్పుబెల్లాలుగా పంచుకున్న తీరుచూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోతున్నారు. ఈ కుంభకోణంలో ఏ కొత్త కోణం వెలుగులోకి వచ్చినా కోట్ల రూపాయల్లో అవినీతి బయటపడుతుండటం వారిని ఆశ్చర్యపరుస్తుంది. ఐఎంఎస్‌లోని అవినీతికి సంబంధించి పూర్తి అవగాహన ఉన్న బాబ్జీ.. ఏండ్లుగా ఈ దందాలో రూ.వందలకోట్లు కొల్లగొట్టినట్టుగా తెలుస్తున్నది. 1998 నుంచి ఓమ్నీమెడీ సంస్థ ఐఎంఎస్‌కు మందులు సరఫరా చేస్తున్న రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థ ల్లో ఉన్నది. టీడీపీకి ఢిల్లీస్థాయిలో కీలకంగా ఉంటూ, ఇటీవల పార్టీ మా రిన నేతల్లో ఒకరు బాబ్జీ వెనుక ఉన్నట్టు ప్రచారం ఉన్నది. కృష్ణా జిల్లాకు చెందిన బాబ్జీ అప్పటి ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులతో ఉన్న పరిచయాలతో భారీ స్కాంలకు తెరతీసినట్టు ఏసీబీ దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నది. 2016 నుంచి 2018 వరకు మూడేండ్లలోనే బాబ్జీకి చెందిన ఓమ్నీమెడీ, దాని షెల్‌ కంపెనీలకు దాదాపు రూ. 203 కోట్లు వెళ్లినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సంపాదించారు. 2016-17లో మొత్తం ఐఎంఎస్‌ బడ్జెట్‌ రూ.167 కోట్లలో రూ.42 కోట్లు, 2017-18లో రూ.233 కోట్ల బడ్జెట్‌లో రూ.100 కోట్లు, 2018-19లో మొత్తం బడ్జెట్‌ రూ.256 కోట్లలో రూ.61 కోట్లు ఓమ్నీమెడీకి కేటాయించినట్టు గుర్తించారు.  logo