శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 02:20:23

దక్షిణాదిపై ‘కోడ్‌' పిడుగు

దక్షిణాదిపై ‘కోడ్‌' పిడుగు

  • లేబర్‌ కోడ్స్‌తో ఉత్తరాది రాష్ర్టాల ఆర్థిక పరుగు
  • చట్టాలు సడలించి పరిశ్రమలకు రెడ్‌ కార్పెట్‌
  • చౌకైన మానవ వనరులతో ఆకర్షించే వ్యూహం
  • రోజుకు 12 పనిగంటలతో ఇండస్ట్రీకి గాలం
  • ఉత్తరాది కార్మికులపైనే ఆధారపడిన దక్షిణాది
  • కార్మికుల వలస ఆగితే పారిశ్రామిక ప్రగతిపై ప్రభావం
  • కార్మిక చట్టాలు సడలించేందుకు దక్షిణాదిలో వెనుకంజ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో ఇప్పటివరకు పారిశ్రామికాభివృద్ధిపై గుత్తాధిపత్యం వహిస్తున్న దక్షిణాది రాష్ర్టాలకు ఇకనుంచి ఉత్తరాది రాష్ర్టాల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ ఆసరాగా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఒడిశా, గుజరాత్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌  తదితర రాష్ర్టాలు పరిశ్రమలను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నాయి. ఈ కోడ్స్‌లో పరిశ్రమలకు భారీగా వెసులుబాట్లు కల్పించటం, కార్మికుల పనిగంటలు పెంచుకొనే అవకాశాలు కూడా ఉండటంతో ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. రోజుకు పనిగంటలను 12 గంటలు చేసి పరిశ్రమలను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఉత్తరాదిలో అపారమైన కార్మిక శక్తి ఉండటం వారికి వరంలా మారుతుందని నిపుణులు అంటున్నారు. దాంతో దక్షిణాది రాష్ర్టాల్లో కార్మికుల కొరత ఏర్పడి పారిశ్రామిక అభివృద్ధి మందగించే ప్రమాదం ఏర్పడవచ్చని భావిస్తున్నారు.

పని గంటల పెంపు

దక్షిణాది రాష్ర్టాలతో పోల్చితే ఉత్తరాది రాష్ర్టాల్లో పారిశ్రామిక అభివృద్ధి అంతంతే. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం ఏటా దాదాపు 45 లక్షలమంది వలస పోతుంటారు. ఈ ఏడాది మార్చిలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించటంతో వలస కార్మికుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. తమ రాష్ర్టాల నుంచి వలసలను నివారించి తీరుతామని ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రకటనలు కూడా ఇచ్చారు. వారికి కేంద్రం తెచ్చిన లేబర్‌ కోడ్స్‌ మరింత ఊపునిచ్చాయి. దాంతో ప్రభుత్వ పారిశ్రామిక విధానాల్లో కీలక మార్పులు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 11న రాజస్థాన్‌, 17న గుజరాత్‌, 20న పంజాబ్‌, 21న హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ర్టాలు కార్మికులకు రోజుకు పనిగంటలు 8 నుంచి 12కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కార్మిక చట్టాలను అతిక్రమించకుండా అధిక పనిగంటలకు అదనపు వేతనం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాయి. ఈ నిర్ణయంతో అటు కార్మికుల ఆదాయం పెరగటమే కాకుండా, పరిశ్రమలకు సమయం కలిసి వస్తుంది. దాంతో క్రమంగా మ్యానుఫాక్చరింగ్‌, ప్రాసెసింగ్‌ వంటి పరిశ్రమలు యూపీ, బీహార్‌ రాష్ర్టాల వైపు చూస్తున్నాయి. 

కార్మికులే కీలకం..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో ఎక్కడ మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభమైనా వాటిలో అధికంగా పనిచేసే కార్మికులు ఉత్తరాది నుంచి వచ్చినవారే అయి ఉంటారు. ముఖ్యంగా నైపుణం అవసరం లేని పనుల్లో నూటికి 90శాతం ఉత్తరాదివారే ఉంటున్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల్లో కూడా వాళ్లే అధికంగా కనిపిస్తుంటారు. దక్షిణాది కార్మికులకు వేతనాలు అధికంగా ఇవ్వాల్సి రావటంతో తక్కువ వేతనాలకు లభించే యూపీ, బీహార్‌ రాష్ర్టాల కార్మికులనే అధికంగా నియమించుకుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తూ కార్మికులను రప్పిస్తున్నారు. దాంతో ఆ కార్మికుల వలసలు ఆగిపోతే దక్షిణాది రాష్ర్టాల్లో తాత్కాలికంగా పారిశ్రామిక ప్రగతి కుంటుపడే ప్రమాదం ఉన్నది. మరోవైపు కార్మిక శక్తి చౌకగా లభించే చోటికే పరిశ్రమలు తరలిపోయే అవకాశం ఉంటుంది. లేబర్‌ కోడ్స్‌లో కొత్తగా ప్రారంభించే పరిశ్రమలకు కార్మిక చట్టాల నుంచి దాదాపు పూర్తిగా మినహాయింపునిచ్చారు. ఈ అవకాశాన్ని ఉత్తరాది రాష్ర్టాలు రెండుచేతులా అందిపుచ్చుకుంటున్నాయి.\

సంకట స్థితిలో దక్షిణాది

తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ర్టాల్లో ఏదో ఒక నైపుణ్యం ఉన్న కార్మికులే ఎక్కువగా ఉన్నారు. దాంతో వారు సహజంగానే వేతనాలు అధికంగా డిమాండ్‌ చేస్తున్నారు. పనిగంటల విషయంలో కూడా కచ్చితంగా ఉంటున్నారు. ప్రభుత్వాలు కూడా కార్మికుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. తాజా పరిస్థితులతో ఇక్కడి పరిశ్రమలు కూడా కార్మిక చట్టాల్లో సడలింపులను కోరే అవకాశం ఉన్నది. దాంతో ప్రభుత్వాలు ఎటువైపు నిలువాలన్నదానిపై సందిగ్దం నెలకొనే అవకాశం ఉన్నది. పరిశ్రమల వినతులను మన్నించకుంటే అవి తమకు అధిక సౌకర్యాలు లభించే ప్రాంతాలకు తరలిపోతాయి. కార్మికుల ప్రయోజనాలపై రాజీ పడితే వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉన్నది. ఉత్తరాదిలో అవసరానికి మించి మానవ వనరులు ఉండటంతో కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చేయకున్నా పనిచేసేందుకు కార్మికులు లభిస్తున్నారు. సుదూర రాష్ర్టాలకు వెళ్తే వచ్చే ఆదాయం స్వరాష్ట్రంలోనే లభిస్తుండటంతో అధికంగా కష్టపడేందుకు కూడా సిద్ధంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ర్టాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. 


logo