మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 16:02:55

నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే

నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే

వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరంలోని నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తప్పని సరిగా తొలగించాల్సిందేనని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  అధికారులను ఆదేశించారు. మంగళవారం మినీ సమావేశ మందిరంలో నాలాలపై అక్రమ నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులపై  పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్, నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి, టాస్క్ ఫోర్స్ కమిటీతో కలిసి కలెక్టర్ సమీక్షించారు.

 ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ కమిటీ చేపట్టి చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నయీంనగర్  బ్రిడ్జి నుంచి డబ్బాల జంక్షన్ వరకు నాలాలపై 27 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. అందులో 14 కట్టడాలను తొలగించినట్లు, ఇంకా 13 అక్రమ కట్టడాలను తొలగించాలని సిటీ ప్లానింగ్ అధికారి నర్సింహులు వివరించారు. మిగిలిన అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు వివరించారు. నాలాల విస్తీర్ణం సరిహద్దు ఎంతో గుర్తించినట్లయితే  అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశం ఉంటుందని సిటీ ప్లానర్  పేర్కొన్నారు.

ఆర్ అండ్ బీ, జాతీయ రహదారులు, మునిసిపాలిటీ ఇరిగేషన్,  సిటీ ప్లానర్ ఎస్ఈలతో  టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ నగర పాలక కమిషనర్ ను ఆదేశించారు. ఈ కమిటీ నగరంలో నాలాల్లో ప్రహిస్తున్నవరదను శాస్త్రీయంగా అంచనా వేసి నాలాల విస్తీర్ణ సరిహద్దు లోతును నిర్ణియిస్తుందన్నారు.   అవసరమైతే కన్సల్టెన్సీ కూడా నియమించుకోవాలని సూచించారు. టెక్నికల్ కమిటీ ముందుగా పెద్ద నాలాలపై  క్షేత్ర స్థాయిలో పరిశీలించి  ఐదు రోజుల్లో పూర్తి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.

  చెరువులు, నాలాల్లోని ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్కల ను తొలగించాలని  ఇరిగేషన్ అధికారులను అదేశించారు. వరదలకు దెబ్బతిన్న ఆర్ అండ్ బీ, మునిసిపాలిటీ, జాతీయ రహదారులను వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. సమావేశం లో డీసీపీ పుష్ప, అర్ డీవో వాసు చంద్ర,  మునిసిపల్ ఎస్ఈ  విద్యాసాగర్, ఇరిగేషన్ ఈ ఈ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


logo