మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 02:41:03

‘అలివి వల’కు చెక్‌

‘అలివి వల’కు చెక్‌
  • స్థానికుల పొట్టకొడితే క్రిమినల్‌ కేసులు
  • అధికారులకు మంత్రి తలసాని ఆదేశాలు
  • ‘నమస్తే తెలంగాణ’ కథనానికి సర్కారు స్పందన
  • మత్స్యకారుల హర్షం

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో అలివి వలలతో అక్రమంగా చేపల వేటను సాగిస్తూ స్థానిక మత్స్యకారుల పొట్టకొడుతున్న దళారులను ఉపేక్షించేది లేదని తెలంగాణ ప్ర భుత్వం హెచ్చరించింది. ‘అలివి గాని వలలు’ శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. స్థానికంగా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఇదే విషయాన్ని ఏపీ మత్స్యశాఖ దృష్టికి తీసుకెళ్లనున్నారు. సర్కార్‌ స్పందించి చర్యలకు ఉపక్రమించడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుం దని, ఇందుకు చొరవ తీసుకున్న ‘నమస్తే తెలంగాణ’కు వారు కృతజ్ఞతలు తెలిపారు.


రంగంలోకి దిగిన అధికారులు.. 

మంత్రి ఆదేశాలతో అధికారులు ఆగమేఘాల మీద కదిలారు. వనపర్తి కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా వెంటనే ఆర్డీవో చంద్రారెడ్డి, డీఎస్పీ కిరణ్‌కుమార్‌, మత్స్యశాఖ ఏడీ ఎస్‌ఎ రహమాన్‌తో సమావేశమయ్యారు. వనపర్తి జిల్లా పరిధిలోకి వచ్చే నదీ పరీవాహక ప్రాంతాలైన చెల్లపాడు, కాలూరు, గూడెం గ్రామాల్లో ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన దళారులు నిషేధిత అలివి వలలను ఉపయోగించి చేపలు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. గతంలో నూ పలుమార్లు దాడులు జరిపి అలివి వలల ను స్వాధీనం చేసుకున్నప్పటికీ మళ్లీ అదే దందాను కొనసాగిస్తున్నట్టు వారు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో అలివి వలల ద్వారా ఎవరూ చేపలు పట్టకుండా ఉండేందు కు పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారు లు, స్థానిక లైసెన్సు కలిగిన మత్స్యకారులతో సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్‌ ప్రకటించారు. అలివి వలల ద్వారా చేపలు పట్టడాన్ని శాశ్వతంగా నిరోధించేందుకు స్థానిక మత్స్యకార సంఘాలతో చిన్నంబావి మండల కేంద్రంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కృష్ణానది పరీవాహకంలో నిఘా పెట్టేలా పోలీసు పెట్రోలింగ్‌కు ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.9ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ శ్రీధర్‌ సైతం స్పందించి ప్రత్యేక బృందాన్ని తనిఖీలకు పంపించారు. చేపల దందాను అడ్డుకునేందుకు శుక్రవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. సర్కారు స్పందనపై  స్థానిక మత్స్యకారులు సంబురపడుతున్నారు.


ఇక క్రిమినల్‌ కేసులే..

నిషేధిత అలివి వలలను వినియోగించి చేపల వేట కొనసాగించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో ప్రభుత్వం విడుదల చేసిన చేపపిల్లలను అలివి వలలతో వేటాడుతున్న ఘటనపై మంత్రి తలసాని స్పందించారు. గురువారం మంత్రి నివాసంలో మత్స్యశాఖ కమిషనర్‌, అధికారులతో సమావేశం నిర్వహించా రు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి ఉచితంగా చేపపిల్లలను విడుదల చేస్తుందన్నారు. తెలంగాణ మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసేలా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ లో అలివి వలలతో చేపలను వేటాడిన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని మత్స్యశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. అక్రమ వేటను అరికట్టేందుకు పోలీస్‌, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులతో బృందాలను ఏర్పాటు చేయాలని వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు గండికొట్టే వారు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని సూచించారు. ఈ ఘటనను ఏపీ మత్స్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మత్స్య శాఖ కమిషనర్‌ సువర్ణను ఆదేశించారు. నిషేధిత వలలతో చేపల వేటను అరికట్టేందుకు మత్స్యశాఖ అధికారిని పర్యవేక్షకుడిగా నియమించినట్టు మంత్రి తెలిపారు.


‘నమస్తే తెలంగాణ’కుకృతజ్ఞతలు 

అలివి వలలతో చేపల దోపిడీని వెలుగులోకి తీసుకొచ్చిన ‘నమస్తే తెలంగాణ’ కు కృతజ్ఞతలు. వాటి తో వేటకు రావాలంటే అక్రమార్కులు భయపడాలి. సర్కార్‌ మాకోసం ఖర్చు చేసిన డబ్బులు వృథాకాకుండా చూసే బాధ్యత అధికారులదే.

- పుట్ట బాలస్వామి,

ఎల్లూరు, కొల్లాపూర్‌ మండలం


 ఇక మా వలల దుమ్ము దులుపుతాం

ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి వలలు, బండ్లు, ఆటోలు, పరికరాలను ఇచ్చింది. ఉచితంగా చేప పిల్లలను వదిలింది. అలివి వలల వల్ల అవన్ని వృథా అయినయ్‌. వాటిని లేకుండా చేస్తే అటకెక్కిన మా వలల దుమ్ము దులుపుతాం. 

- విరూపాక్షమ్మ,

ఎల్లూరు, కొల్లాపూర్‌ మండలం


దొరకంగనేతగులబెట్టాలి..

గతంలో అలి వి వలలను అధికారులకు ప ట్టించాం. కానీ  ఆ వలలను తిరిగి వారికే ఇచ్చేసి చేతులు దులుపుకొన్నారు. ప్రభుత్వం నిషేధించిన వలలను ఎక్కడ స్వాధీనం చేసుకుంటే అక్కడే తగులబెట్టాలి. అప్పుడే ఇలాంటి ప్రయత్నం చేయరు.

 - చిన్న భాస్కర్‌, 

ఎల్లూరు, నాగర్‌ కర్నూలు జిల్లా


logo
>>>>>>