గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 02:19:05

అలెక్సా.. ఇక అచ్చతెలుగులో

అలెక్సా.. ఇక అచ్చతెలుగులో

  • ఐఐటీ హైదరాబాద్‌ వినూత్న ఆవిష్కరణ

హైదరాబాద్‌, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే ముచ్చటించిన అలెక్సా యాప్‌ ఇకపై అచ్చ తెలుగులోనూ అలరించనున్నది. తెలుగులో మాట్లాడే అలెక్సాను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ అభివృద్ధి చేసింది. ప్రాంతీయ భాషలకు ప్రాచుర్యం కల్పించేందుకు ‘బహు భాషక్‌' పేరిట ఐఐటీ హైదరాబాద్‌లో లాంగ్వేజ్‌ టెక్నాలజీ రిసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ఇందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద రూ.కోటి సైతం మంజూరుచేసింది. ఈ వనరులను వినియోగించుకుని ఐఐటీ బృందం తెలుగు స్పీచ్‌డాటాసెట్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు దేశంలో హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో మాత్రమే డాటాసెట్లు లభిస్తున్నాయి. దీంతో వాటి తర్వాతి స్థానాన్ని.. ప్రాంతీయభాషల్లో మొదటి స్థానాన్ని తెలుగు సొంతం చేసుకున్నది. ప్రాంతీయ భాషల్లో డాటాసెట్లు తయారుచేయడంతో భాషాపరమైన సమస్యలను అధిగమించినట్లవుతుందని యూనివర్సిటీ పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు గల ఈ డాటాసెట్‌లో ఎంత డాటా నిక్షిప్తం చేస్తే అంత సమర్థంగా పనిచేస్తుందని,  తాము పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా తెలుగులో 2వేల గంటలపాటు పనిచేసే డాటాసెట్‌ను తయారుచేశామని ప్రొఫెసర్‌ ప్రకాశ్‌ ఎల్లా తెలిపారు. ఇతర ప్రాంతీయభాషల్లోనూ డాటాసెట్ల తయారీకి తాము సహకారం అందిదిస్తామని, నోడల్‌ ఏజెన్సీగా సైతం వ్యవహరించేందుకు సిద్ధమని ప్రకాశ్‌ ఎల్లా వెల్లడించారు.


logo