శనివారం 04 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 02:03:06

600కే కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌

600కే కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌

  • 20 నిమిషాల్లో ఫలితం
  • హైదరాబాద్‌ ఐఐటీ అద్భుత సృష్టి
  • పేటెంట్‌ హక్కుల కోసం పంపిన పరిశోధకులు 

కంది: కరోనాపై పోరులో హైదరాబాద్‌ ఐఐటీ కీలక అడుగు వేసింది. కొవిడ్‌-19 టెస్ట్‌ కిట్‌ను రూ. 600కే అందించనున్నది. దీని ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ఫలితాన్ని రాబట్టవచ్చు. ప్రస్తుతం ఒక వ్యక్తి రక్తనమూనాలను వైద్య పరీక్షకు పంపితే వ్యాధి నిర్ధారణకు రెండురోజుల సమయం పడుతున్నది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐఐటీ హైదరాబాద్‌ (కంది) పరిశోధకులు ఈ కిట్‌ను రూపొందించారు.  ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ శివగోవింద్‌సింగ్‌ నేతృత్వంలో డాక్టర్‌ సూర్యస్నాతా త్రిపాఠి, నాల్గో సంవత్సరం విద్యార్థి పట్టా సుప్రజ బృందం ఈ టెస్టింగ్‌ కిట్‌ను అభివృద్ధి చేసింది. 

ఈ కిట్‌ ఎటువంటి ఆర్‌టీపీసీఆర్‌ (రివర్స్‌ ట్రాన్సిప్షన్‌ పాలిమరేస్‌ చైన్‌ రియాక్షన్‌) అవసరం లేకుండానే పనిచేస్తుందని వారు వివరించారు. దీనిని ఇప్పటికే హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ, అనుబంధ దవాఖానలో పరీక్షించినట్టు తెలిపారు. పేటెంట్‌ హక్కుల కోసం ఈ కిట్‌ను పంపించారు. హక్కులు రాగానే మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నారు. భారీ ఉత్పత్తి కనుక జరిగితే రూ.350కే లభ్యమయ్యే అవకాశం ఉన్నదని పరిశోధకులు తెలిపారు. రూ.600 విలువగల ఈ కిట్‌ను ఒక్కరికి ఒక్కసారే వాడాలి. ఇతరులకు వినియోగించవద్దు.  logo