ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 03:06:13

కరోనా మందు తయారీలో మనమే ముందు

కరోనా మందు తయారీలో మనమే ముందు

  • ‘నమస్తే తెలంగాణ’తో ఇంటర్వ్యూలో ఐఐఐఎం జమ్మూ డైరెక్టర్‌  డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి
  • శోభనాద్రిపురం టు ఐఐఐఎం జమ్మూ దాకా.. శాస్త్రవేత్తగా ఎదిగిన యాదాద్రి భువనగిరి వాసి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మారుమూల ప్రాంతానికి చెందిన శోభనాద్రిపురానికి రైతుబిడ్డ డాక్టర్‌ డుంబాల శ్రీనివాస్‌రెడ్డి అంచెలంచెలుగా శాస్త్రవేత్తగా అత్యున్నత హోదాకు ఎదిగారు. 20 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లను దాటారు. దేశంలోనే అత్యున్నతమైన శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డును సొంతం చేసుకొన్నారు. ఇటీవల ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ (ఐఐఐఎం) జమ్మూ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌రెడ్డితో ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆయన మాటల్లోనే..

తెలుగు మాధ్యమం.. పరిశోధనంటే ఇష్టం

మాది నిరుపేద కుటుంబం. అమ్మానాన్న నర్సింహారెడ్డి, వినోద. నాకోసం చాలా కష్టపడ్డారు. సొంతూళ్లో నా ప్రాథమిక విద్య సాగింది. ఉన్నత విద్య కోసం సైకిల్‌పైనే 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామన్నపేటకు వెళ్లేవాడిని. నిజాం కళాశాలలో ఎంఎస్సీ పూర్తిచేశా. డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే చదివాను. పరిశోధనా విద్యార్థిగా ‘సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ’లో చేరి 2000లో పీహెచ్‌డీ పూర్తిచేశా. ఆ తర్వాత ఆమెరికాలోని చికాగో, కెన్సాస్‌ యూనివర్సిటీల్లో పోస్ట్‌ డాక్టోరల్‌ వర్క్‌ పూర్తయింది. తర్వాత ఇండియాకు తిరిగివచ్చి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌లో 2003లో గ్రూప్‌ లీడర్‌గా చేరాను. పరిశోధనరంగంపై ఉన్న మక్కువతో సీఎస్‌ఐఆర్‌ -నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీకి వెళ్లాను. నా భార్య విద్య ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసింది. కొడుకు యశ్వంత్‌రెడ్డి వీఐటీలో చదువుతున్నాడు. నా ఉన్నతవిద్య సమయంలో గణితం ఉపాధ్యాయుడు రవీందర్‌ ప్రోత్సాహం, పరిశోధన సమయంలో ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ మెహతా ఇచ్చిన గైడెన్స్‌ మరిచిపోలేనిది. ఐఐఎం డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం నాకు లభించిన అరుదైన గౌరవం.

వ్యాక్సిన్‌ తయారీలో ముందువరుస

దేశంలోని అనేక ఔషధ సంస్థలలో పనిచేశాను. కరోనాకు మందు కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక ఔషధ తయారీసంస్థలు, పరిశోధనసంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలో సీఎస్‌ఐఆర్‌ చాలా చురుకుగా పరిశోధనలు చేస్తున్నది. హైదరాబాద్‌లోని ఐఐసీటీ, జమ్మూలోని ఐఐఐఎం, లక్నోలోని సీడీఆర్‌ఐ వంటి సంస్థలు కరోనా నివారణ మందును కనుగొనే ప్రయత్నంలో ముందువరుసలో ఉన్నాయి. ఇది శుభ పరిణామం. ప్రస్తుతం ఉన్న యాంటీ-వైరల్‌ డ్రగ్స్‌ రెమిడెసివిర్‌, ఫావిపిరవిర్‌ వంటివి కరోనా చికిత్సలో చక్కగా ఉపయోగపడుతున్నాయి.

వందల్లో పరిశోధనలు

ఇప్పటివరకు వందకుపైగా పరిశోధనా పత్రాలను రాయగా.. 35 పరిశోధనలకు పేటెంట్‌కు అర్హతను పొందాయి. పరిశోధనలకు గుర్తింపుగా 2013లో అవార్డ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ డ్రగ్‌ రిసెర్చ్‌, 2013లో సైంటిస్ట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డ్‌, 2015లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్లాటినం జూబ్లీ అవార్డ్‌, 2015లో కెమికల్‌ రిసెర్చ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నుంచి కాంస్య పతకం, 2015లో సీఎస్‌ఐఆర్‌ నుంచి శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు వరించింది. యువత క్రమశిక్షణతో రాణించాలి. సైన్స్‌, పరిశోధనారంగం వైపు దృష్టిసారించాలి.logo