మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 00:49:45

ఉగ్రవాదులకు సింహస్వప్నం

ఉగ్రవాదులకు సింహస్వప్నం

  • 48 గంటల్లో జానకీపురం ఎన్‌కౌంటర్‌ నిందితుల హతం
  • ఎన్నో పురస్కారాలు అందుకున్న ఐజీ ప్రభాకర్‌రావు
  • 1991లో డీఎస్పీగా చేరి నేడు ఐజీగా పదవీ విరమణ  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని అంతమొందిచడంలో దిట్టగా పేరుగాంచిన స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)ఐజీ ప్రభాకర్‌రావు మంగళవారం పదవీవిరమణ చేస్తున్నారు. అప్పగించిన బాధ్యతల్లో విజయాలు సాధిస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిల్లో అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. నల్లగొండ ఎస్పీగా పనిచేసిన సమయంలో జానకీపురం ఎన్‌కౌంటర్‌లో కానిస్టేబుల్‌, హోంగార్డుల మృతి కారకులైన ఇద్దరు ఉగ్రవాదులను 48 గంటల్లో తుదముట్టించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. 1991లో డీఎస్పీగా విధుల్లో చేరిన ప్రభాకర్‌రావు అంచెలంచెలుగా ఎదిగి ఐజీగా పదోన్నతి పొందారు. సబ్‌ డివిజినల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా 1993 నుంచి 1999 వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వైజాగ్‌, జగిత్యాల, మంచిర్యాల, నల్లగొండల్లో కీలకంగా పనిచేశారు. 1999లో నల్లగొండ అడిషనల్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. 2001 నుంచి 2003 వరకు హైదరాబాద్‌ సిటీ అడిషనల్‌ డీసీపీ (ట్రాఫిక్‌)గా, 2003-2007 ఎస్‌ఐబీలో ఎస్పీగా విధులు నిర్వర్తించే క్రమంలో కీలక ఆపరేషన్లలో పాల్గొని ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. 2007 నుంచి ఏడాదిపాటు హైదరాబాద్‌లో ఈస్ట్‌జోన్‌ డీసీపీగా పనిచేశారు. 2009 నుంచి 2013 వరకు మళ్లీ ఎస్‌ఐబీ ఎస్పీగా బాధ్యత స్వీకరించి మావోయిస్టు కార్యకలాపాలను అణచడంలో సఫలీకృతులయ్యారు. 2013 నుంచి 2015 వరకు నల్లగొండ ఎస్పీగా పనిచేశారు. 2015లో డీఐజీగా పదోన్నతి పొందిన ప్రభాకర్‌రావు హైదరాబాద్‌ సిటీ జాయింట్‌ కమిషనర్‌ (క్రైం)గా, 2016లో కొంతకాలంపాటు వరంగల్‌ డీఐజీగా పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు నిఘావిభాగంలో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐజీగా పదోన్నతి పొందారు. అప్పటినుంచి ఎస్‌ఐబీ ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభాకర్‌రావు 30 ఏండ్ల సర్వీసులో చేసిన కృషికిగాను ఆయనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మహోన్నత పతకాలు అందించాయి. 2006లో ఉత్తమ సేవలకు సేవాపతకం, 2012లో ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అందుకున్నారు. ఇక నల్లగొండ ఎస్పీగా ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకోవడంలో చూపిన ధైర్యసాహసాలకుగాను 2016లో పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలెంటరీ పొందారు. 2019లో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి మహోన్నత సేవా పతకాన్ని అందించింది.  

నేడు మరో ముగ్గురు ఐపీఎస్‌ల రిటైర్మెంట్‌ 

వరంగల్‌ సీపీ రవీందర్‌, పోలీస్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ, ఐజీ మల్లారెడ్డి, మాదాపూర్‌ డీసీపీ, సైబరాబాద్‌ జాయింట్‌ సీపీగా పనిచేస్తున్న వెంకటేశ్వర్‌రావు సైతం మంగళవారం పదవీ విరమణ పొందనున్నారు. 


logo