ఆదివారం 07 జూన్ 2020
Telangana - Mar 31, 2020 , 14:43:29

కూరగాయలు కావాలంటే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి..

కూరగాయలు కావాలంటే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి..

హైదరాబాద్‌ : ఎల్బీనగర్‌ కూరగాయల మార్కెట్‌ను తాత్కాలికంగా సరూర్‌నగర్‌ స్టేడియంలోకి తరలించడానికి ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు, పలు ఖాళీ ప్రదేశాలకు కూరగాయల మార్కెట్లను తరలిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా ప్రజలు గుమిగూడే అవకాశం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కొనుగోళ్లకు వచ్చిన ప్రజలు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసి తగు ఏర్పాట్లకు సూచనలు చేస్తున్నారని మంత్రి తెలిపారు.

మొబైల్‌ రైతు బజార్ల ద్వారా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలకు తక్కువ ధరకు కూరగాయలు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. మొబైల్‌ రైతు బజార్లకు ఆయా అపార్ట్‌మెంట్లు, కాలనీ వాసుల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. కూరగాయలు కావాల్సిన కాలనీ, అపార్ట్‌మెంట్‌ వాసులు 7330733212 ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేసి నమోదు చేసుకుంటే వాహనం వచ్చే సమయం చెబుతారని మంత్రి తెలిపారు. మొబైల్‌ రైతు బజారు నడపాలనుకుంటున్న యువకులు, ఇతరులు కూడా ఈ నంబర్‌ను సంప్రదించొచ్చు అని మంత్రి సూచించారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి కరోనా వైరస్‌ ప్రబలకుండా సహకరించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరం సమీక్షిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు రాకుండా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

రాష్ర్టానికి వలస వచ్చిన కూలీలను కూడా వారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నవారు.. వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాం అని వారికి వసతి కల్పిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని చెప్పారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రజల సహకారం సంపూర్ణంగా ఉండాలన్నారు. ఎల్బీనగర్‌ కూరగాయల మార్కెట్‌ను తాత్కాలికంగా సరూర్‌నగర్‌ స్టేడియంలోకి తరలించడానికి ఏర్పాట్లను పరిశీలించినట్లు మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. 


logo