శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 00:36:43

బీజేపీకి ఓటేస్తే అధోగతే

బీజేపీకి ఓటేస్తే అధోగతే

  • ఏటికేడు దేశ ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతున్నది
  • 8 శాతం వృద్ధి నుంచి మైనస్‌ 24 శాతానికి జీడీపీ పతనం 
  • 15 నుంచి 16 శాతం పెరిగిన తెలంగాణ రాష్ట్ర జీడీపీ
  • నేటి దేశవ్యాప్త సమ్మెకు టీఆర్‌ఎస్‌ మద్దతు: మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/పటాన్‌చెరు/రామచంద్రాపురం: ‘దేశానికి తామేదో గొప్ప చేశామని బీజేపీ చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 8 శాతంగా ఉన్న జీడీ పీ వృద్ధి.. ఇప్పుడు మైనస్‌ 24 శాతానికి పడిపోయింది. ఇంకా వీళ్లకు ఓటేస్తే అధోగతి తప్ప దు. అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి అండగా నిలుద్దాం. గ్రేటర్‌లో మరోసారి గులాబీ జెండా ఎగురేద్దాం’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో పటాన్‌చెరు, భారతీనగర్‌, రామచంద్రాపురం డివిజన్లలో విస్తృతంగా ప్రచా రం నిర్వహిస్తున్నారు. బుధవారం రామచంద్రాపురం డివిజన్‌లోని జ్యోతినగర్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు. అనంతరం పటాన్‌చెరు జీఎమ్మార్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో బీహెచ్‌ఈఎల్‌, ఓడీఎఫ్‌, బీడీఎల్‌ ఉద్యోగులతో సమావేశమై టీఆర్‌ఎస్‌కు మద్దతు కోరారు. గురువారం చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. 

గుజరాత్‌లో నీటికి కటకట

కేంద్ర ఆర్థికాభివృద్ధి ఏటికేడు దారుణంగా పడిపోతున్నదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ అద్భుత పాలనలో తెలంగాణ రాష్ట్రంలో జీడీపీ 15 నుంచి 16 శాతానికి పెరిగిందని తెలిపారు. జీఎస్టీలో కేంద్రానికి రూ.18 వేల కోట్లు అందించగా.. సెస్‌ రూపంలో రాష్ట్రం అతి తక్కువగా పొం దిందన్నారు. 14 శాతం కన్నా తక్కువ వృద్ధి రేటు ఉన్న రాష్ర్టాలకు మాత్రమే కేంద్రం జీఎస్టీ పరిహారం ఇస్తున్నదని చెప్పారు. ఆర్థికాభివృద్ధిలో కేంద్రం క్రమంగా వెనకబడిపోతుంటే.. తెలంగాణ వృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. ‘ఇంటింటికి తాగునీళ్లు అందించడంతో తెలంగాణ అద్భుత రికార్డు సాధించింది.. అదే, గుజరాత్‌లో ఇప్పటికీ నీటి కోసం ప్రజలు గోసపడుతున్నా పట్టించుకోరు.. హైదరాబాద్‌ మహానగరం మొదలుకొని భద్రాచలం గొం డు గూడెం వరకు ప్రతి ఇంటికీ సురక్షితమైన నీళ్లు అందిస్తున్నాం’ అని తెలిపారు. మూడేండ్లలో మిషన్‌ భగీరథ పూర్తికావడం రికార్డు కాగా, యునెస్కో, ప్రపంచ ఆరోగ్య సంస్థల గుర్తింపు పొందడం మరో రికార్డు అని గుర్తుచేశారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంటు కోతలతో పరిశ్రమలు మూతపడి కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడితే.. ఇప్పుడు 24 గం టల విద్యుత్‌ సరఫరాతో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, కార్మికులు ఓటీలు చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ వస్తే నక్సలై ట్లు వస్తారని, హైదరాబాద్‌లో కర్ఫ్యూ ఉం టుందని దుష్ప్రచారం చేశారని, ఆరేండ్లలో తెలంగాణ ఎంతో ప్రశాంతంగా ఉండి రికార్డు లు సాధిస్తున్నదని పేర్కొన్నారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ లక్ష్యం

మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు పొందడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నదని మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సేఫ్‌ సిటీ కావడంతోనే ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు హైదరాబాద్‌కు పెట్టుబడులతో వస్తున్నాయని చెప్పారు. స్థానిక సంస్థలకు కేంద్రం పైసా విదల్చదని చెప్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని నిప్పులు చెరిగారు. మేకిన్‌ ఇండియా అంటూ ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలకు మంగళం పాడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. విదేశాలకు అర్డర్లు ఇస్తున్న మోదీ.. దేశంలోని సర్కారు సంస్థలకు మొండిచెయ్యి చూపుతున్నారని దుయ్యబట్టారు. కార్మికుల క్షేమం కోరే రాష్ట్ర ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్‌ వంటి సంస్థలకు యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు సంబంధించి రూ.30 వేల కోట్ల ఆర్డర్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలే శరణ్యమన్నా రు. దేశవ్యాప్త సమ్మెకు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్మే గూడెం మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo