శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 23:53:45

ఈ జాగ్రత్తలు పాటిస్తే.. కరోనా ఖతం: మంత్రి కేటీఆర్‌

ఈ జాగ్రత్తలు పాటిస్తే.. కరోనా ఖతం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా దావానంలా వ్యాపిస్తున్న మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్‌.. ఇవాళ ట్విట్టర్‌లో ప్రజలు తెలిపిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించగా, సొంత వాహనాలతో బయటికొచ్చినా అడుగడుగునా పోలీసులు గస్తీ కాస్తూ, వారిని తిరిగి ఇళ్లకు పంపిస్తున్నారు. 

దీంతో, గత్యంతరం లేని కొందరు ట్విట్టర్‌ ద్వారా మంత్రితో తమ సమస్యలను తెలిపారు. అందుకు సానుకూలంగా స్పందించిన కేటీఆర్‌.. సంబంధిత అధికారులకు రీట్వీట్‌ చేసి, వారి సమస్యలు తీర్చమని విన్నవించారు. మంత్రి తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడంతో వారు ధన్యవాదాలు తెలిపారు. 

కాగా, మంత్రి కేటీఆర్‌ కరోనాను దరిచేయనీయొద్దంటే పలు సూచనలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని తెలిపారు. ప్రతి వ్యక్తి.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే 104కు కాల్‌ చేయాలని సూచించారు. అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలనీ, సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని తెలిపారు.

ప్రతి ఒక్కరు విధిగా స్వీయనిర్బంధంలో ఉండాలని తెలిపిన మంత్రి.. ఈ సమయాన్ని బరువుగా కాకుండా, బాధ్యతగా భావించాలన్నారు. రాష్ర్టాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే కేంద్ర, రాష్ట్ర సూచనలు గౌరవించి, పాటించాలని తెలిపారు. 


logo