గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 10:18:15

జలుబు, జ్వరం, దగ్గు ఉంటే.. ఈ నెంబర్ కు కాల్ చేయండి..

జలుబు, జ్వరం, దగ్గు ఉంటే.. ఈ నెంబర్ కు కాల్ చేయండి..

హైదరాబాద్‌: కోవిద్‌-19 లక్షణాలు ఉన్న వ్యక్తులు నేరుగా హెల్ప్‌లైన్‌ నంబరు 104 సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిద్‌- 19 వ్యాప్తిని అరికట్టేందుకు నగర పరిధిలో నియమించిన 150 బృందాలు పరిస్థితులను మానిటరింగ్‌ చేస్తున్నాయని తెలిపారు.  వీరివద్ద నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేందుకు జీహెచ్‌ఎంసీ హెడ్‌ ఆఫీసులో కంట్రోల్‌ రూం నెలకొల్పారు. కంట్రోల్‌ రూం ఇన్‌చార్జ్ జీహెచ్‌ఎంసీ విశ్రాంత అదనపు కమిషనర్‌ అనురాధను నియమించారు. జీహెచ్‌ఎంసీ, 108 వాహన సర్వీసు, వైద్యఆరోగ్యశాఖకు సంబంధించిన అధికారులు మూడు షిఫ్టులలో అందుబాటులో ఉంటున్నారు. 24 గంటలు పనిచేస్తున్న కంట్రోల్‌రూం విధులలో ఆయాశాఖలను ఐటీ విభాగం డీఈ బెనర్జీ, ఏఎంహెచ్‌వో డాక్టర్‌ ఉమారాణి సమన్వయం చేస్తున్నారు.

మార్చి 1వ తేదీ నుంచి విదేశాల నుంచి నగరానికి వచ్చినవారి జాబితాను కంట్రోల్‌రూంకు ప్రభుత్వం పంపుతున్నది. విదేశాల నుంచి వచ్చిన వారి జాబితాను ఆయా సర్కిళ్లలో ఉన్న బృందాలకు కంట్రోల్‌రూం అందిస్తున్నది. సంబంధిత జాబితా ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లను వార్డు స్థాయి బృందాలు సందర్శించి 14 రోజులపాటు హోం క్వారంటైన్‌ జరిగిందా లేదా, ఆవ్యక్తితో పాటు కుటుంబసభ్యుల ఆరోగ్యస్థితిపై సేకరించిన వివరాలను కంట్రోల్‌రూమ్‌కు పంపుతారు.

అదేవిధంగా వార్డు బృందాలు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి హోంక్వారంటైన్‌ స్టాంపును చేతిపై వేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తికి , ఆ వ్యక్తితోపాటు ఉంటున్న సభ్యులకు కోవిద్‌ 19 లక్షణాలు కనిపిస్తే కంట్రోల్‌ రూమ్‌కు తెలపాలి. అటువంటి వ్యక్తులకు వైద్య సేవలందించుటకు ఐసోలేషన్‌ కేంద్రాలు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలను తరలించుటకు కంట్రోల్‌రూం నుంచి మానిటరింగ్‌ చేస్తారు. ఇతరశాఖలతో కూడా సమన్వయం చేస్తున్నారు.  


logo
>>>>>>