శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 02:20:20

చివరి సదవకాశం సాదాబైనామా

చివరి సదవకాశం సాదాబైనామా

  • లక్షమంది అన్నదాతలకు  ప్రయోజనం
  • త్వరలో మార్గదర్శకాలు జారీ
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయంతో అధికారుల ఏర్పాట్లు
  • రైతులకు అవగాహన కార్యక్రమాలు
  • 2.50 లక్షల ఎకరాలు క్రమబద్ధీకరణకు అవకాశం
  • ఉపయోగించుకోలేకపోతే ‘ధరణి’లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

అవగాహన లేమి, నిరక్షరాస్యత కారణంగా గతంలో చాలా మంది సాదాబైనామాకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా సాదాబైనామాకు మరో అవకాశమివ్వాలని పలువురు ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెల్లకాగితంపై రాసుకొని భూమి కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న అన్నదాతలు దానిని తమ పేరుమీదకు మార్చుకోవడానికి మరో అవకాశం కలిగింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సాదాబైనామా ద్వారా క్రమబద్ధీకరించుకొనేందుకు చివరి అవకాశం కల్పించారు. సీఎం ఆదేశాల మేరకు సాదాబైనామాను ప్రకటించడానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. వీలైనంత త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ప్రభుత్వం కల్పించే ఈ చివరి అవకాశం ద్వారా దాదాపు లక్షమంది రైతులకు ప్రయోజనం కలుగనున్నదని తెలుస్తున్నది. 

తెలంగాణలో తెల్లకాగితాలపై, మాట ముచ్చటపై జరిగే లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. రిజిస్ట్రేషన్‌కు డబ్బుల్లేక పేద రైతులు ఎక్కువమంది మాటమీదనే భూములను కొనుగోలు చేస్తుంటారు. దీంతో ఆయా భూముల రికార్డుల్లో పట్టాదారుగా అమ్మినవ్యక్తే పేరు వస్తున్నది. కొనుగోలుదారుని పేరు అనుభవదారుగా కాలంలోనే ఉం టుంది. సీఎం కేసీఆర్‌ 2016లోనే సాదాబైనామాకు అవకాశం కల్పించారు. 2016 జూన్‌ 3న రాష్ట్ర ప్రభుత్వం సాదాబైనామాకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ మార్గదర్శకాలు విడుదలచేసింది. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 11,19,111 మంది దీనికింద దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన రెవెన్యూ అధికారులు 6,18,368 దరఖాస్తులకు చెందిన 2,68,610 ఎకరాలను క్రమబద్ధీకరించారు. అసైన్డ్‌ భూములు, దేవాదాయ, వక్ఫ్‌, అటవీ- రెవెన్యూ వివాదాలున్న భూములు 1/70 చట్టం పరిధిలోని భూములకు చెందిన 4,19,430 దరఖాస్తులను తిరస్కరించారు. చట్టం పరిధిలో క్రమబద్ధీకరించడానికి అవకాశంలేని భూములు కావడంతో తిరస్కరించారు.

అవగాహనలేమితో వినియోగించుకోని రైతులు

అవగాహన లేమి, నిరక్షరాస్యత కారణంగా గతంలో ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని రైతులు వినియోగించుకోలేకపోయారు. రెవెన్యూ అధికారులు కూడా చొరవ చూపకపోవడంతో అనేకమంది సాదాబైనామాకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మరోసారి అవకాశం ఇస్తే ఈ భూములన్నింటిని తెల్లకాగితాలపై కొనుగోలుచేసిన రైతులకు పట్టాలు చేయవచ్చునని వివరించారు. సాదాబైనామాకు మరో అవకాశమివ్వాలని పలువురు ప్రజాప్రతినిధులు కూడా సీఎం కేసీఆర్‌కు పలుమార్లు విజ్ఞప్తిచేశారు. దీంతో ముఖ్యమంత్రి సాదాబైనామాకు అవకాశమిచ్చారు. ఇప్పుడు కూడా అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిన రైతులు ఆ తరువాత ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా డబ్బులు చెల్లించి డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందేనని అధికారులు అంటున్నారు. ప్రభుత్వంవద్ద ఇప్పటికే ఆయా భూములకు సంబంధించిన వివరాలు ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా చొరవ చూపనున్నట్టు తెలిసింది. ఈ మేరకు రైతుల్లో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.