శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Jan 16, 2021 , 22:23:16

సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని

సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని

నల్లగొండ :  సీఎం కేసీఆర్‌ ఏది చెప్పినా దాన్ని చట్టం చేసినట్లే అమలు చేస్తారని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శనివారం నల్గొండలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మొదటి విడుత పెండింగ్‌ గొర్రెల యూనిట్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పశువులకు, జీవాలకు వైద్యం అందించేందుకు దేశంలో సంచార పశు వైద్యశాలలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. ఒక్కోయూనిట్‌లో 20 గొర్రెలు, పొట్టేలును అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాల గారడీ మాటలు నమ్మి కులసంఘాలు ఆగం కావొద్దు.

కేసీఆర్ నాయకత్వంలో కులవృత్తులు పూర్వ వైభవం సంతరించుకున్నాయని అన్నారు. అనంతరం మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. చరిత్రలో ఏ నాయకుడు అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ చేస్తున్నారని పేర్కొన్నారు. గొర్రెల పంపిణీ పథకం గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. గతంలో తెలంగాణ మాంసం దిగుమతి చేసుకునేది.. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. వచ్చే బడ్జెట్‌లో రెండోవిడుత గొర్రెల పంపిణీకి నిధులు కేటాయించాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు మర్యాద లేకుండా మాట్లాడుతూ.. ప్రజల్లో చులకన అవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులన్నీ పూర్తవుతున్నాయి. ఈ ప్రభుత్వానికి ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా నష్టపోయేది ప్రజలేనని గుత్తా అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, యాదవ సంఘం నాయకులు, గొర్లకాపారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo