సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 21:57:46

ఇద్దరు కరోనా అనుమానితుల గుర్తింపు

ఇద్దరు కరోనా అనుమానితుల గుర్తింపు

కామారెడ్డి  : కామారెడ్డి జిల్లాలో కరోనా కలవరం సృష్టిస్తున్నది. ఒకే రోజు రెండు అనుమానిత కేసులు వెలుగు చూడడంతో ప్రజలంతా బెంబేలెత్తుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానలో తీవ్ర దగ్గు, జ్వరం, జలుబుతో బాధ పడుతున్న సీఆర్పీఎఫ్‌ జవాన్‌ను వైద్యులు హైదరాబాద్‌ ఛాతి దవాఖానకు తరలించారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్‌ తండాకు చెందిన జవాన్‌ జమ్మూ క్యాంపు నుంచి స్వస్థలానికి వచ్చాడు. సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏ9 బోగిలో బెర్త్‌ నెంబర్‌ 6లో ఆయన ప్రయాణించాడు. ఇదే రైలులో ఇండోనేషియా నుంచి వచ్చిన 13 మంది మత ప్రచారకులు సైతం ఉండడం, వారికి కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో బుధవారమే 8 మందికి కరోనా పాజిటివ్‌ తేలడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తున్నది.

 12వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ 14వ తేదీ ఉదయం 9.30 గంటలకు మాచారెడ్డి చౌరస్తాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్లాడు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి, కామారెడ్డి పట్టణంలో పర్యటించిన అతడు రెండు రోజుల నుంచి దగ్గు, జ్వరం, జలుబుతో బాధ పడుతూ జిల్లా దవాఖానలో గురువారం అడ్మిట్‌ అయ్యాడు. వైరస్‌ లక్షణాలు కనిపించడం, ట్రావెల్‌ హిస్టరీ సైతం అనుమానాస్పదంగా ఉండడంతో హుటాహుటిన జిల్లా వైద్యాధికారులు అతన్ని హైదరాబాద్‌కు తరలించారు.

ఈజిప్టు నుంచి మరో వ్యక్తి...

ఇదిలా ఉండగా లింగంపేట మండలం ముంబోజి తండాకు చెందిన ఓ వ్యక్తి ఈజిప్టు దేశానికి విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ టెస్టులు చేశారు. ఇతనితో పాటుగా 12 మందిని నిర్బంధ చికిత్సకు రిఫర్‌ చేయగా 11 మందిని నియంత్రణలో ఉంచుకుని ఇతన్ని మాత్రం వదిలేశారు. 16న స్వగ్రామానికి వచ్చిన తర్వాత గురువారం ఉదయం నుంచి దగ్గు, జలుబు, జ్వరంతో బాధ పడుతుండడంతో అనుమానంతో బాన్సువాడ ఏరియా దవాఖానకు వెళ్లాడు. 

బాధిత యువకుడిని పరిశీలించిన వైద్యాధికారులు వెంటనే మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌కు పంపించారు. కామారెడ్డి జిల్లాలో ఇద్దరు అనుమానితులు వెలుగు చూడడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బాధిత యువకులు ఎవరెవరిని కలిశారో తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను జిల్లా కలెక్టర్‌ శరత్‌ నియమించారు.logo