శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 20, 2020 , 02:36:24

కరోనాపై ‘బీసీజీ’ పనిచేస్తుందా?

కరోనాపై ‘బీసీజీ’ పనిచేస్తుందా?

  • అధ్యయనానికి ఐసీఎమ్మార్‌ శ్రీకారం
  • 1,500 మంది వృద్ధులపై ప్రయోగం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మన దేశంలో ప్రతి ఒక్కరూ బీసీజీ వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్లే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నదని గతంలో భావించారు. ఈ దిశగా అధ్యయనంచేయాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) నిర్ణయించింది. ఆరు రాష్ర్టాల్లోని ‘కొవిడ్‌ హాట్‌స్పాట్‌'లలో ఉన్న 60- 95 ఏండ్ల మధ్యవయసువారిని గుర్తించి, వారిపై పరిశోధనలుచేయాలని సంకల్పించింది. ఇందుకోసం తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీని ఎంపికచేసింది. కరోనా లక్షణాలు లేని 1,500 మంది వృద్ధులకు బీసీజీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. వృద్ధులకు వ్యాక్సిన్‌ ఇస్తే ఎలాంటి ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతున్నాయి? అవి కరోనాను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతున్నాయా? వ్యాక్సిన్‌ ప్రభావంతో మరణాల రేటు తగ్గుతున్నదా? వంటి వివరాలను సేకరిస్తామని ఐసీఎమ్మార్‌ శాస్త్రవేత్త తెలిపారు. 0.1 మిల్లీలీటర్ల వ్యాక్సిన్‌ను ఒక డోస్‌ ఇస్తామని పేర్కొన్నారు. అదే ప్రాంతంలోని వ్యాక్సిన్‌ తీసుకోని మరికొందరు వృద్ధులను గుర్తించి, రెండు గ్రూప్‌ల మధ్య వ్యత్యాసాలను గుర్తిస్తామన్నారు. ఈ పరిశోధన ఆరు నెలలపాటు కొనసాగుతుందని చెప్పారు.


logo