మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 14:42:54

20 ఏండ్లుగా నేను అయ్యప్ప స్వామి భక్తుడిని

20 ఏండ్లుగా నేను అయ్యప్ప స్వామి భక్తుడిని

మహబూబాబాద్-తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నె స్వాముల దీక్షా స్వీకరణ కార్యక్రమంలో సతీ సమేతంగా, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది కన్నె స్వాములు దీక్ష తీసుకున్నారు. గురు స్వామి నరసింహయ్య కన్నె స్వాములకు దీక్ష‌ను అందచేశారు. మంత్రి ఎర్ర‌బెల్లి దంపతులు అయ్యప్ప స్వామి విగ్రహం ఎదుట కొబ్బరికాయలు కొట్టి కన్నె స్వాములతో దీక్ష స్వీకరింప‌జేశారు. 


అనంత‌రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. నూతనంగా మాల వేసుకుంటున్న, అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న కన్నె స్వాములకు శుభాకాంక్షలు తెలిపారు. 20ఏళ్లుగా తాను కూడా అయ్యప్ప స్వామి భక్తుడినన్నారు. వర్ధన్నపేటలో ఒక గుడి కూడా కట్టించాను. భక్తి శ్రద్ధలతో పని చేస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి. కష్టాలు తీరుతాయి. మంచి జరుగుతుంది. అంతా క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మనం చేసుకునే పుణ్యాలు మన పిల్లల మీద ప్రభావాన్ని చూపుతాయి. పాపాలు కూడా అదే స్థాయిలో తమ ప్రభావాన్ని చూపుతాయి అని నమ్ముతాను. పాపాలు చేసే వాళ్లకు తాత్కాలికంగా సుఖాలు కలగవచ్చు. కానీ దీర్ఘకాలికంగా చూస్తే  నిజమైన భక్తులకు ఆలస్యమైనా తప్పకుండా మంచే జరుగుతుందన్నారు.


ఈ రోజు దీక్ష తీసుకుంటున్న వాళ్ళు  త్రికరణ శుద్ధితో పూజలు చేయాలి. దేవుడిని గట్టిగా నమ్మితే, కొరుకున్నవి జరిగి తీరుతాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి సూచించారు. మనసు లగ్నం చేస్తే కానిదేది లేదు. సంకల్పం గట్టిగా ఉండాలి. భక్తి కేవలం విశ్వాసం మాత్రమే కాదు. అదొక జీవన విధానం. అయ్యప్ప భక్తుల జీవన విధానం ఎంతో శ్రేష్ఠమైనది. అందరూ ఆచరించవలసినది అని అన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.