ఆదివారం 31 మే 2020
Telangana - May 04, 2020 , 02:05:46

ఆరోగ్యసేనకు సైన్యం సెల్యూట్‌

ఆరోగ్యసేనకు సైన్యం  సెల్యూట్‌

  • వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య,  జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సైన్యం గౌరవ వందనం

కరోనాపై పోరాడుతున్న వైద్యులు, వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ సూచకంగా ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖాన ప్రాంగణంపై పూలవర్షం కురిపిస్తున్న భారత సైనిక హెలికాప్టర్‌.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/బన్సీలాల్‌పేట్‌/అంబర్‌పేట: గగనతలంలో దూసుకుపోతూ.. శత్రువులపై బాంబులు కురిపించే సైనిక విమానాల నుంచి గులాబీలు జాలువారాయి. కనిపించని కరోనా శత్రువుపై పోరాడుతున్న వైద్యవీరులకు.. దేశాన్ని రక్షించే సైన్యం అపురూప గౌరవవందనం సమర్పించింది. ఈ ఘట్టానికి గాంధీ దవాఖాన వేదికైంది. ఆదివారం ఉదయం హకీంపేట నుంచి బయలుదేరిన భారత వాయుసేన విమానం సరిగ్గా 10.23 గంటలకు గాంధీ దవాఖాన ప్రాంగణంలో పూలవాన కురిపించింది. తమకు లభించిన అపురూపమైన గౌరవానికి వైద్యలోకం పరవశించిపోయింది.

దవాఖానలో పనిచేస్తున్న వెయ్యిమంది వైద్యులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, పేషెంట్‌ కేర్‌ అసిస్టెంట్లు, వార్డు బాయ్‌లు, స్వీపర్లు, సెక్యూరిటీ సిబ్బంది, పరిపాలనా విభాగం ఉద్యోగులు, పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది దవాఖాన ప్రాంగణంలో నిలుచుని ఈ గౌరవ వందనాన్ని స్వీకరించారు. చప్పట్లు కొట్టి, భారత్‌మాతాకీ జై అంటూ నినదించారు. దవాఖాన ప్రాంగణంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం దగ్గర సంగీత కళాకారులు వందేమాతరం గీతంతోపాటు ‘హమ్‌ హోంగే కామియాబ్‌'.. ‘ఐ లవ్‌ మై ఇండియా’ వంటి దేశభక్తి గీతాలను ఆలపించారు. అనంతరం వాయుసేన అధికారులు గాంధీ వైద్యులు, సిబ్బంది, పోలీసులు, జీహెచ్‌ఎంసీ పా రిశుద్ధ్య సిబ్బందికి బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రక్షణ దళాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో గాంధీ దవాఖాన ఎదురుగా రోడ్డుపై పలువురు యువకులు జాతీయ జెండాలను పట్టుకొని హర్షం వ్యక్తంచేశారు. 


వైద్యుల్లో ఉత్తేజం: ప్రభుత్వ వైద్యుల సంఘం హర్షం

కరోనాపై పోరాడుతున్న డాక్టర్లకు భారత సైన్యం పూలవర్షంతో అపురూప గౌరవాన్ని ఇవ్వడంతో వైద్యుల్లో నూతనోత్తేజం వచ్చిందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు పల్లం ప్రవీణ్‌కుమార్‌, ప్రభుత్వ వైద్యుల సంఘం(డీహెచ్‌) అధ్యక్షుడు లాలూప్రసాద్‌ రాథోడ్‌, వైద్య ఉద్యోగులసంఘం అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, తెలంగాణ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ జేఏసీ చైర్మన్‌ బరిగల రమేశ్‌, జూనియర్‌ డాక్టర్ల సంఘం నాయకులు హర్షం ప్రకటించారు. 

ఫీవర్‌ హాస్పిటల్‌లో

నల్లకుంట ఫీవర్‌ దవాఖాన సిబ్బందిని సదరన్‌ స్టార్‌ ఆర్మీ వారియర్స్‌ రాజ్‌పుత్‌ 19 బెటాలియన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. వైద్యులు, సిబ్బందిపై వారు పూలవర్షం కురిపించారు. ప్రాణదాతలుగా వెలుగొందుతున్న ఫీవర్‌ దవాఖాన సిబ్బందిని సన్మానించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు ఆర్మీ వారియర్స్‌ తెలిపారు. 

ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి

  • మంత్రి ఈటల రాజేందర్‌


కరోనా బారినపడకుండా తెలంగాణ ప్రజలు నిర్ణీతదూరం పాటిస్తూ.. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. పాక్షిక సడలింపుల నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. కొవిడ్‌-19 బారినపడి చికిత్స ద్వారా కోలుకుని 50 శాతానికిపైగా డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మెరుగైన చికిత్స అందిస్తున్న గాంధీ వైద్యులను మంత్రి అభినందించారు. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని పలుచోట్ల సత్కరించడం, వారిని ప్రత్యేకంగా గుర్తించడం ఆనందం కలిగిస్తున్నదని చెప్పారు.

కరోనా కట్టడికి ‘కొవిడ్‌-19 ట్రాకర్‌' 

  • సాంకేతిక అస్త్రం రూపొందిస్తున్న పోలీసులు

కరోనా వైరస్‌వ్యాప్తిని పక్కాగా కట్టడి చేసేందుకు కొవిడ్‌-19 ట్రాకర్‌ను ఓ ఐటీ సంస్థ సహకారంతో పోలీసుశాఖ రూపొందిస్తున్నది.దీనిలో వైరస్‌ సోకినవారి వివరాలు, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ల మ్యాపింగ్‌, వారుంటున్న ప్రాంతాలను జియోట్యాగింగ్‌ చేయడం, రోగుల వయస్సు, లింగం, ప్రాంతం వారీగా విశ్లేషించేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. పాజిటివ్‌ కేసుల వివరాలు ఇందులో నమోదుచేస్తే జిల్లా, పోలీస్‌స్టేషన్ల వారీగా విశ్లేషణ కనిపిస్తుంది. ఆ సంఖ్య ఆధారంగా వచ్చే ఏడురోజుల్లో వైరస్‌ విస్తరించేందకు ఉన్న అవకాశాలను సైతం ఈ సాఫ్ట్‌వేర్‌ అంచనా వేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా వైరస్‌ కట్టడికి చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.

 ప్రజల సహకారంతో జయిస్తాం 

త్రివిధ దళాల ఆధ్వర్యంలో కరోనా వారియర్లకు పుష్పాభిషేకం చేయడం అపూర్వం. ఇదొక చారిత్రక ఘట్టం. సమాజానికి, కరోనా వైరస్‌కు మధ్య వారధిగా ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, పోలీసులకు, పారిశుద్ధ్య సిబ్బందికి ఈ అరుదైన గౌరవం లభించింది. ఇప్పుడు యుద్ధంలాంటి వాతావరణం నెలకొన్నది. ప్రజల సహకారంతో దీన్ని జయిస్తాం. కుటుంబాలకు దూరంగా ఉండి విధులు నిర్వహిస్తున్న మా కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ, సీఐలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. 

- అంజనీకుమార్‌, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌

 ఒక అరుదైన గౌరవం  

భారత వాయుసేన ఈరోజు పూలవర్షం కురిపించడం మాకు, సిబ్బందికి ఎంతో గర్వంగా ఉన్నది. ఈ ‘ఫ్లోరల్‌ సెల్యూట్‌' మాకు లభించిన ఒక అరుదైన గౌరవంగా భావిస్తున్నాం. మా ఆనందం మాటల్లో చెప్పలేనంతగా ఉన్నది. ఇది మా సేవలకు లభించిన గుర్తింపు. ఈ రోజు గాంధీ దవాఖాన చరిత్రలో నిలిచిపోతుంది. మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. మరింత అంకితభావంతో సేవలు అందించడానికి ఇది ప్రేరణగా నిలుస్తుంది. వాయుసేనకు ధన్యవాదాలు. 

- డాక్టర్‌ ఎం రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ దవాఖాన 


logo