మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 19:09:42

కలిసి జరుపుకోలేకపోయినా.. బతుకమ్మకు దూరం కాలేదు:కవిత

కలిసి జరుపుకోలేకపోయినా.. బతుకమ్మకు దూరం కాలేదు:కవిత

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో మనమంతా కలిసి జరుపుకోలేకపోయినా..బతుకమ్మకు దూరం కాలేదని ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆమె తయారు చేసిన బతుకమ్మ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఏడాది బతుకమ్మ విభిన్నమని, అయితే సామాజిక మాధ్యమాలు మనందరిని దగ్గర చేశాయని చెప్పారు. ప్రియమైన తల్లులు, అక్కచెల్లెళ్లు బతుకమ్మను ఎలా జరుపుకుంటున్నారో చూడాలని ఉందన్నారు.  ‘నాబతుకమ్మ.. నాకెంతోగర్వం’ అన్న హ్యాష్‌ ట్యాగ్‌తో బతుకమ్మ ఫొటోలను కవిత షేర్‌ చేశారు. 


దీనికి ముందు శనివారం ఉదయం రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి, నిండు మనస్సుతో గౌరమ్మను కొలిచే నిండైన వేడుక మన బతుకమ్మ పండుగ. ఈ సందర్భంగా.. ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అని కవిత అన్నారు. ఈ మేరకు వీడియోను విడుదల చేశారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ అంటేనే ఎంతో సందడిగా ఉంటుందని, అయితే ప్రస్తుతం కరోనా ‌మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘ఇలాంటి పరిస్థితులలో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ, యూట్యూబ్‌లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నాం’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.


ఓ పక్క కరోనా, మరోపక్క హైదరాబాద్‌లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మనమందరం ఒకరికొకరు అండగా నిలుస్తూ, బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. వరదల‌ కారణంగా నష్టపోయిన వారందరినీ ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణ సాయంగా రూ.550 కోట్లను విడుదల చేయడం సంతోషదాయకం అన్నారు.‌  హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని ఎమ్మెల్సీ కవిత ప్రార్థించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.