గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 16:39:47

నాపై ఆరోపణలు చేస్తున్నవారిపై చట్ట ప్రకారం ముందుకెళ్తా

నాపై ఆరోపణలు చేస్తున్నవారిపై చట్ట ప్రకారం ముందుకెళ్తా

నల్లగొండ : నా కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన ఓ భూమిని ఆధారంగా చేసుకుని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలకు సిద్ధమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. చట్ట ప్రకారమే భూమిని కొనుగోలు చేసినా కావాలని నన్ను సోషల్ మీడియా వేదికగా బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీ అధిష్ఠానం వద్ద తనకు చెడ్డ పేరు వచ్చేవిధంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ మేరకు నల్లగొండలో భూవివాదంపై వివరణ ఇస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ..నార్కట్ పల్లి  మండలం మాండ్రా గ్రామంలో నా కొడుకు మనోజ్ పేరు మీద 10 ఎకరాల 10 గుంటలు భూమిని  కొనుగోలు చేశామని చెప్పారు. 296, 292  సర్వే నంబర్ లలో శ్రీశైలం అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశానన్నారు. కానీ, రెండు నెలలుగా కావాలని వక్ర బుద్ధితో తప్పుడు ప్రచారం చేస్తూ తనపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. 

రౌడీయిజం చేసి, అధికారం దుర్వినియోగం చేసి, బలవంతంగా భూమిని లాక్కున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. రాజకీయంగా దెబ్బ తీసే విధంగా  ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూదందాలకు పాల్పడుతున్నానని  నిన్న ఓ టీవీ చానల్ లో, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజల కోసమే పని చేస్తానని, పోలీసులను సొంతానికి  వాడుకోవడం నాకు మొదటి నుంచి  అలవాటు లేదన్నారు

పార్టీ మారినప్పటి నుంచి నన్ను టార్గెట్ చేస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదన్నారు. కుట్రలు అన్నీ చట్టపరంగా ఎదుర్కుంటా. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.


logo