గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:47:05

ముందే జల విద్యుత్‌

ముందే జల విద్యుత్‌

  • సహకరిస్తున్న ప్రకృతి
  • ముందస్తు వర్షాలు, వరదలతో అవకాశం
  • గతేడాది సమైక్య రాష్ట్రంలోకంటే ఎక్కువ ఉత్పతి
  • ఈ సీజన్‌లో ఇప్పటికే జూరాలలో మొదలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న 24 గంట ల విద్యుత్‌కు ప్రకృతికూడా సహకరిస్తున్నది. గత రెండేండ్లుగా వస్తున్న వరదలతో కృష్ణాబేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టుల్లో జలవిద్యుత్‌ గరిష్ఠంగా ఉత్పత్తి అవుతున్నది. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లకు వరద పోటెత్తుతుండటంతో జల విద్యుత్‌ ముందుగానే అందుబాటులోకి వస్తున్నది. కృష్ణాబేసిన్‌లో కొన్నేండ్లుగా జల విద్యుదుత్పత్తిని పరిశీలిస్తే.. సగటున జూలై చివరన లేదా ఆగస్టు మొదట్లో ప్రారంభించేవారు. బేసిన్‌లోని తెలంగాణలో మొదటి ప్రాజెక్టు జూరాలలో 2018-19లో జూలై 18న, 2019-20లో జూలై 30న విద్యుదుత్పత్తి మొదలయింది. ఈ ఏడాది ఈ నెల 14వ తేదీన అప్పర్‌ జూరాల, లోయర్‌ జూరాలలో విద్యుదుత్పత్తి మొదలవడం విశేషం. గతంలో ఏటా 2 వేల మిలియన్‌ యూనిట్ల కంటే తక్కువగానే జలవిద్యుత్‌ ఉత్పత్తి జరుగగా.. గతేడాది (2019-20) కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో సమైక్య రాష్ట్రంలో కంటే అధికంగా.. రికార్డు స్థాయిలో 4,510 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి అయింది. అంతగా వర్షాలు లేకపోవడంతో 2015-16లో అత్యంత తక్కువగా.. 285 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ మాత్రమే ఉత్పత్తి అయింది.

కృష్ణాపైనే భారీ అవకాశం

రాష్ట్రంలో జలవిద్యుత్‌ ఉత్పత్తికి కృష్ణానదిపైనే ఎక్కువ అవకాశం ఉన్నది. కృష్ణాపై శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించింది ప్రధానంగా జలవిద్యుత్‌ కోసమే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక రాష్ట్ర కరెంట్‌ అవసరాలు తీర్చడంలో జలవిద్యుత్‌ ప్రాజెక్టులు ఎంతో తోడ్పతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 2430.60 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉండగా.. మినీహైడల్‌ ప్రాజెక్టుల ద్వారా మరో 11.16 మెగావాట్లు ఉత్పత్తి అవుతున్నాయి. అన్నింటిలోనూ ముఖ్యమైనవి శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రాలు. సాగర్‌లో మొత్తం 8 యూనిట్ల ద్వారా 815.60 మెగావాట్లు, శ్రీశైలంలో 150 మెగావాట్ల సామర్థ్యంఉన్న 6 యూనిట్ల ద్వారా 900 మెగావాట్లు ఉత్పత్తి చేయవచ్చు. లోయర్‌, అప్పర్‌ జూరాలలో 474 మెగావాట్ల సామర్థ్యం ఉన్నది. పులిచింతలలో 120 మెగావాట్లతోపాటు, సాగర్‌ ఎడమకాలువపై 60 మెగావాట్లతో కేంద్రాలు ఉన్నాయి. గోదావరిపై పోచంపాడ్‌ వద్ద మాత్రమే 36 మెగావాట్ల జల విద్యుత్‌ కేంద్రం ఉన్నది.

విద్యుత్‌రంగానికి శుభసూచకం

ముందస్తు వర్షాలు, వరదలు రాష్ట్రంలో విద్యుత్‌రంగానికి శుభసూచకం. ఈ ఏడాది మరింత ముందే జల విద్యుదుత్పత్తి ప్రారంభించాం. అప్పర్‌, లోయర్‌ జూరాలలో 4 రోజుల క్రితమే జలవిద్యుత్‌ ప్రారంభమయింది. మంచివర్షాలు పడుతున్నాయి.. అవసరమైతే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోనూ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే సూచించారు. గతేడాది జలవిద్యుత్‌ను గరిష్ఠంగా ఉత్పత్తి చేయగలిగాం. ఈ ఏడాది కూడా ఆశాభావంతో ఉన్నాం. ఆ సంకేతాలు కూడా కనపడుతున్నాయి.

-దేవులపల్లి ప్రభాకర్‌రావు, సీఎండీ, జెన్‌కోlogo