గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 01:36:13

ప్రశాంత ప్రగతికి ఓటు

ప్రశాంత ప్రగతికి ఓటు

  • అరాచక శక్తులను నిలువరించాలని దృఢ నిశ్చయం 
  • ఏకతాటిపై సబ్బండ వర్గాలు 
  • ఆత్మగౌరవ బావుటా ఎగరేసేందుకు సమాయత్తం 
  • ఆలోచనలో హైదరాబాదీలు..!.. నేడే తీర్పు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎన్నికలు వస్తా యి పోతాయి.. కానీ హైదరాబాదీలు శాశ్వతం.. హైదరాబాద్‌ కీర్తిప్రతిష్ఠలు శాశ్వతం.. హైదరాబాద్‌లో ప్రగతి, అభివృద్ధి శాశ్వతం.. హైదరాబాద్‌లో శాంతియుత వాతావరణం శాశ్వతం.. అరమరికలు లేకుండా అన్ని వర్గాలు కలిసిమెలిసి జీవించడం శాశ్వతం.. అందుకే ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలను హైదరాబాదీలు కీలకంగా భావిస్తున్నారు. ఆలోచించి ఓటు వేయకపోతే ఆగమైపోతామన్న భావన హైదరాబాదీల్లో నెలకొన్నది. హోరాహోరీ ప్రచారంలో భాగంగా ఇక్కడి ప్రశాంత వాతావరణం, ప్రగతి, అభివృద్ధి కన్నా.. మతాలు, వర్గాలవారీగా విభజిస్తూ కాషాయపార్టీ చిమ్మిన విషం.. ఆందోళనకర అంశాలను లేవనెత్తడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఓటర్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆచితూచి లోతుగా ఆలోచించి అడుగువేయాలనే నిర్ణయానికి వచ్చారు.

దండెత్తిన నేతలు..

మునుపెన్నడూలేని ప్రచార పటాటోపం ఈ సారి ఎన్నికల ప్రచారంలో హోరెత్తింది. జరిగేవి స్థానిక ఎన్నికలైనా.. కేంద్రం నుంచి 12 మంది మంత్రులు, వివిధ రాష్ర్టాల నుంచి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కాషాయపార్టీ అధ్యక్షుడితోపాటు ఏకంగా ప్రధానమంత్రి సైతం పరోక్షంగా హైదరాబాద్‌పై దండయాత్రచేసినట్టు దిగబడ్డారు. సర్జికల్‌ స్ర్టైక్స్‌ చేస్తామన్న వ్యాఖ్యలు మేధావులు, అక్షరాస్యులను ఉలిక్కిపడేలా చేశాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్‌ మహానగరిలో తాముచేసిన అభివృద్ధిని, పాదుకొల్పిన ప్రశాంతతను చెప్పుకొంటూ ఓటర్ల దగ్గరికి వెళ్లారు. అదే కాషాయనేతలు మాత్రం  ప్రజలపై మిడతల దండును తలపించే రీతిలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాం..అదీ చాలకపోతే సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని బరితెగించి మరీ రెచ్చిపోయారు. ఓటర్లను భ్రయభ్రాంతులకు గురిచేశారు. కేంద్రంలో తామే అధికారంలో ఉన్నామనే అహంకారంతో  ఆ పార్టీ నేతలు వ్యవహరించిన తీరుపై  గతంలో  ఎన్నడూలేనివిధంగా ప్రజల్లో చర్చ సాగింది. ప్రశాంతజీవితాల్లో అశాంతిని కొనితెచ్చుకోవటం అవసరమా? అని సబ్బండ వర్గాల ప్రజలు ఆలోచనలో పడ్డారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం హైదరాబాద్‌లో నెలకొన్న గంగాజమునా తహెజీబ్‌ సంస్కృతిపై తేజాబ్‌ పోసి మరీ ఛిద్రం చేయాలని కూసిన కూతలకు కర్రుకాల్చి వాతపెట్టాలని జీహెచ్‌ఎంసీ ప్రజలు భావిస్తున్నారు. 

గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ప్రజలు

టీఆర్‌ఎస్‌ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో ఇవే అంశాలను ప్రజలకు తమ జవాబుదారీతనాన్ని, బాధ్యతాయుతంగా హుందాగా  ప్రజలకు వివరించింది. టీఆర్‌ఎస్‌ చెప్పిన విధంగా గత ఆరేండ్లుగా అన్ని రంగాల్లో జరిగిన ప్రగతిని కండ్లముందు పెట్టుకొని అవతలివాళ్లు చేస్తున్న నిరాధార ఆరోపణల కన్నా కేంద్రంలో తమకు అధికారం ఉన్నదని,  తామెంతకైనా బరితెగిస్తామన్నట్టుగా రెచ్చిపోయి కూసే కూతల నోళ్లకు తాళం వేయాలని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్న స్పష్టమైన వాతావరణం నెలకొన్నది. హైదరాబాద్‌పై గింత కండ్లమంటతనమెందుకు? ప్రశాంత నగరాన్ని అశాంతి పాలు చేయాలని చూసే దగుల్బాజీలకు గుణపాఠం చెప్పాల్సిందేనని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతోపాటు అనేక కుల సంఘాలు, కాలనీలు, బస్తీలు,  వర్తక, వ్యాపార, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు బాజాప్తాగా తమ మద్దతు మీకే అని టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడంలోని ఆంతర్యం అరాచకశక్తులకు అడ్డుకట్టవేయటానికే అన్నది స్పష్టమవుతుంది. మరోవైపు సమాజ హితమే పరమావధిగా భావించే మేధావులు,  కవులు, కళాకారులు, గాయకులు, సాహితీవేత్తలు ...లెఫ్ట్‌ టూ రైట్‌  ఇలా అన్ని వర్గాలు తమతమ ఇజాలను పక్కనపెట్టి   నిర్భయంగా ఈసారి తాము టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇస్తామని ముందుకు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ ప్రజలుకూడా ఆలోచనలో పడ్డారు. తాము, తమ కుటుంబాలు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమా.. నిరంతరం భయం భయంగా, ఘర్షణలు, కొట్లాటలతో బతకడం కావాలా అనే ఆలోచన చేస్తున్నారు. అభివృద్ధి, ప్రగతి, తమతోపాటు తమ పిల్లల భవిష్యత్తు గురించి యోచిస్తున్నారు. ఆ ఆలోచన ఒక రూపు దిద్దుకుంది. తమ భవిష్యత్తు ప్రగతి వైపు చూపిస్తున్నది. ఇక ఓటరుగా, ఒక బాధ్యత కలిగిన హైదరాబాదీగా తన వంతు కర్త్యవ్యాన్ని నిర్వర్తించడమే మిగిలింది. నేటితో తాను చెప్పదల్చుకుంది స్పష్టంగా దుర్మార్గపు పార్టీల చెంప ఛెళ్ళు మనేలా తాను వివేకంతో తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించడానికి బయలుదేరాడు..! 

టీఎస్‌ బీపాస్‌కా..? కర్ఫ్యూ పాస్‌కా..?

ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజకీయ పార్టీలు తమతమ ఎజెండాను ప్రజల  ముందుపెట్టడం ఆనవాయితీ. తాము అధికారంలోకి వస్తే ఏమి చేయబోతున్నామో చెప్పటం పరిపాటి.  అధికారంలో ఉన్న పార్టీ తమ హయాంలో సాధించిన ప్రగతిని వివరించి రాబోయే కాలంలో ఫలానా ఫలానా కార్యక్రమాలు చేపడతామని ప్రజల ముందుకు వెళ్లటం అన్నది ఇప్పటి దాకా జరిగిన అన్ని ఎన్నికల్లో జరిగిన ప్రచారంతీరు. కానీ ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో అందుకు భిన్నంగా వ్యవహరించాయి. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ, గత పాలకవర్గంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.67 వేల కోట్లతో వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజల ముందుపెట్టింది. హైదరాబాద్‌ అభివృద్ధిపై తమకున్న చిత్తశుద్ధిని చాటుకొన్నది. ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలని, ప్రజలు ప్రశాంతంగా పిల్లాపాపలతో ఉండాలని ఆకాంక్షించింది. కానీ ప్రత్యర్థి పార్టీలు ప్రత్యేకించి కాషాయ పార్టీ ప్రజల్ని  ఆందోళనకు గురిచేసింది. ప్రజలమీద..ప్రాంతంమీద తమకు బాధ్యత ఉన్నదని, రెచ్చిపోయి పిచ్చికూతలు కూసేవారికి వివేచనతో బుద్ధిచెప్పాలని టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. ‘మీ ఓటు అరాచకానికా..అభివృద్ధికా..? విద్వేషకారులకా..? వికసిత గులాబీలకా? ప్రశాంత ప్రగతికా..? విచ్ఛిన్నకర శక్తులకా? టీఎస్‌-బీపాస్‌కా.. కల్లోల భరిత కర్ఫ్యూ పాస్‌కా? ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరింది.  వివేచనతో సుభిక్ష హైదరాబాద్‌ కోసం పాటుపడుతున్న తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. 


logo