సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 16:44:32

ఏజెంట్ మోసం.. మ‌లేషియాలో హైద‌రాబాదీ అరెస్ట్‌

ఏజెంట్ మోసం.. మ‌లేషియాలో హైద‌రాబాదీ అరెస్ట్‌

హైద‌రాబాద్: వీసా గడువు ముగిసినప్ప‌టికీ అక్క‌డే ఉన్నాడ‌న్న ఆరోప‌ణ‌తో హైద‌రాబాద్‌కు చెందిన మహమ్మద్ చాంద్ పాషా అనే వ్యక్తిని మలేసియా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం కోసం మలేసియాకు వెళ్లి ఏజెంట్ చేతిలో మోస‌పోయి, తిరిగి భారత్‌కు వస్తున్న క్రమంలో విమానాశ్రయంలో పాషా అరెస్ట‌య్యాడు. వందేభారత్ మిషన్ విమానం ద్వారా హైద‌రాబాద్‌కు వస్తున్న సమయంలో అధికారులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.

దీంతో త‌న కుమారుడిని హైద‌రాబాద్‌కు ర‌ప్పించ‌డానికి సాయం చేయాలని బాధితుడి తండ్రి మహమ్మద్ మహమూద్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. తిరుపతికి చెందిన ఏజెంట్ సతీష్ ద్వారా తన కుమారుడు  మలేసియాకు వెళ్లాడ‌ని, అక్కడ ఓ టిష్యూ తయారీ కంపెనీలో నెలకు రూ.30వేల జీతం ఇస్తార‌ని, భోజనం, వసతి సదుపాయాలు సంస్థే భరిస్తుందని ఏజెంట్ చెప్పాడ‌ని మ‌హ‌మూద్ చెప్పాడు. తీరా త‌న కుమారుడు విజిట్ వీసాపై మ‌లేసియాకు వెళ్ల‌గా అక్క‌డ ఏ ఉద్యోగం దొర‌క‌లేద‌ని, ఇంత‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించ‌డంతో అక్క‌డే చిక్కుకుపోయాడ‌ని తెలిపాడు. 

ఈ క్రమంలో వందేభారత్ మిషన్ విమానం ద్వారా తిరిగి హైద‌రాబాద్‌కు వ‌చ్చేందుకు విమానాశ్ర‌యానికి రాగా అక్క‌డి అధికారులు త‌న బిడ్డ‌ను అరెస్ట్ చేశార‌ని మ‌హ‌మూద్ వాపోయాడు. ఏజెంట్ మోసం వ‌ల్లే త‌న కుమారుడు దేశంకాని దేశంలో చిక్కుకుపోయాడ‌ని, ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుని ఎలాగైనా త‌న కొడుకు తిరిగి ర‌ప్పించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తిచేశాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo