సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 02:46:36

రెండోసారీ పాజిటివ్‌

రెండోసారీ పాజిటివ్‌

  • వచ్చిన వారికే మళ్లీ కరోనా
  • హైదరాబాద్‌లో ఆరు కేసులు
  • వీరిలో వైద్య సిబ్బందే ఎక్కువ
  • నూటికి 25మందిలోఈ ప్రభావం
  • గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ ఒకసారి సోకిన వారికి రెండోసారి రాదన్న నమ్మకాలు పటాపంచలవుతున్నాయి. ఒకసారి వైరస్‌ సోకినవారిలో యాంటిబాడీస్‌ తయారవుతాయని, అందువల్ల వారికి ఆరు నెలల వరకూ రెండోసారి కరోనా వచ్చే అవకాశం దాదాపు ఉండబోదని వైద్యనిపుణులు చెప్తూ వచ్చారు. ఈ వాదనలను తారుమారుచేస్తూ ఒకసారి కరోనాకు గురైన వారికే రెండోసారి వైరస్‌ సోకుతున్న ఘటనలు తాజాగా నమోదవుతున్నాయి. ఇలా రెండోసారి వైరస్‌ బారిన పడుతున్నవారిలో వైద్యసిబ్బంది ఎక్కవగా ఉంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇలాంటి కేసులు ఆరు నమోదైనట్టు అధికారులు తెలిపారు. ‘ఒకసారి వైరస్‌ సోకిన వ్యక్తికి మళ్లీ వ్యాధి సంక్రమించే కేసులు చాలా అరుదుగా ఉంటాయి. రోగి శరీరంలో వైరస్‌ పూర్తిగా నశించకపోవడం వల్లనే రెండోసారి ఆ లక్షణాలు బయటపడుతాయి. ఇది ‘లేట్‌ సైటోకైండ్‌ స్టామ్‌' ప్రభావంతో జరుగుతుంది. ఊపిరితిత్తుల్లోని శ్వాసకోశల నుంచి వైరస్‌ పోతుంది కానీ, శరీరంలోని ఇతర భాగాల్లో ఉండిపోతుంది.

రోగ నిర్ధారణకు పీసీఆర్‌ లేదా యాంటిజెన్‌ పరీక్షలను స్వాబ్‌ ద్వారా జరుపుతారు. అప్పుడు ఊపిరితిత్తుల్లో వైరస్‌ లేకపోవడం వల్ల ఫలితంగా నెగెటివ్‌ వస్తుంది. కానీ కొన్నిరోజుల తరువాత లక్షణాలు బయటపడుతాయి. అప్పుడు పరీక్షలు చేస్తే పాజిటివ్‌ వస్తుంది. ఇలాంటి కేసులు నూటికి 25 ఉంటాయి. కరోనా సోకినవారిలో వైరస్‌ దాదాపు 28 రోజుల పాటు ఉంటుంది. వైరస్‌ సోకిన 10 రోజుల తరువాత సదరు పాజిటివ్‌ రోగి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశాలు చాలా తక్కువ. అందుకే పాజిటివ్‌ రోగులను 10 నుంచి 14రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉంచుతాం. ఐసొలేషన్‌ తరువాత వారిలో వైరస్‌ ఉన్నా అది ఇతరులకు వ్యాప్తిచెందే అవకాశాలు పెద్దగా ఉండవు’ అని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. 


logo