గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 27, 2020 , 01:48:24

స్ట్రాత్‌ఫీల్డ్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సంధ్యారెడ్డి

స్ట్రాత్‌ఫీల్డ్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సంధ్యారెడ్డి
  • ఆస్ట్రేలియాలో భారతసంతతి మహిళకు అరుదైన పురస్కారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారతసంతతికి చెందిన సంధ్యారెడ్డికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మక ‘స్ట్రాత్‌ ఫీల్డ్‌ సిటిజన్‌ ఆఫ్‌ ది ఇయర్‌- 2020’ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. అవార్డు అందుకున్న తొలి భారతసంతతి మహిళగా సంధ్యారెడ్డి గుర్తింపు పొందారు. ఆస్ట్రేలియాలోని భారతీయులు గర్వించేలా అక్కడి ప్రభుత్వం నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సమాజసేవతోపాటు పర్యావరణ పరిరక్షణకు కృషిచేసేవారిని స్ట్రాత్‌ ఫీల్డ్‌ సిటిజన్‌ అవార్డుకు ఎంపికచేస్తారు. దేశంలోకి వచ్చే కొత్తవారికి సాయం చేయడం, వారికి సలహాలు సూచనలు ఇవ్వడం, పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా చూడటంలో సంధ్యారెడ్డి సహకారం అందించారు. క్లీన్‌అప్‌ ఆస్ట్రేలియా డేలో పాలుపంచుకోవడం, స్వచ్ఛతపై ప్రచారం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, స్థానిక పాఠశాలల్లో చదరంగం పోటీలు ఏర్పాటుచేయడం వంటి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. స్ట్రాత్‌ ఫీల్డ్‌ ప్రాంతంలో అత్యవసర సేవలందించడంలో ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సేవలకుగాను సంధ్యారెడ్డిని అవార్డు వరించింది. ఆమె చిన్న కుమారుడు నిఖిల్‌రెడ్డి 2017 ఆస్ట్రేలియన్‌ చెస్‌ జూనియర్‌ చాంపియన్‌గా నిలిచాడు.


logo