గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 02:20:25

మండే సూరీడు!

మండే సూరీడు!

  • ఈసారి ఎండల తీవ్రత అధికమే
  • ఉత్తర, ఈశాన్య తెలంగాణలో ఎక్కువ  
  • 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం
  • గత ఏడాదితో పోల్చితే కొంచెం తక్కువ
  • పగలు ఎండ.. రాత్రి వేళలో వర్షాలు
  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వేసవి మంట పుట్టించనున్నది! ప్రచండ భానుడు మరోసారి ప్రతాపం చూపనున్నాడు! ఈ సీజన్‌లో గరిష్ఠంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నది. గత ఏడాది గరిష్ఠంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందనేదే ఊరట కల్పించే విషయం. ఈ ఏడాది వేసవి ప్రభావంపై హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్య్వూలో పలు విషయాలు వెల్లడించారు. గత ఏడాది మే నెలలో గరిష్ఠంగా రామగుండంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత, హైదరాబాద్‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. 

ప్రస్తుత సీజన్‌లో వాతావరణంలో పెద్దగా చెప్పుకోదగిన మార్పులేవి ఉండబోవని, ఎండల తీవ్రత 2018 ఏడాది కంటే ఎక్కువ, 2019 కంటే కొంచెం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. మే నెలలో ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగీల్ర వరకు నమోదవుతాయని పేర్కొన్నారు. గత ఏడాది మే నెలలో గరిష్ఠంగా 43.4 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. 2018లో వారంపాటు వడగాలులు వీయగా, 2019లో 44 రోజులపాటు వీచాయని వివరించారు. ఈ వేసవిలో 20 నుంచి 22 రోజులు వడగాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపారు. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు, క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. 


logo
>>>>>>