శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 20:23:43

నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు అందుకున్న హైద‌రాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌

నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు అందుకున్న హైద‌రాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌

హైద‌రాబాద్ : ఫ‌్రెండ్లీ పోలిసింగ్‌ను పాటిస్తున్న మ‌న పోలీసుశాఖ ఏ ఆప‌దైనా తామున్నామంటున్న సంగ‌తి తెలిసిందే. ఎటువంటి ప‌రిస్థితుల్లోనైనా పౌరులు త‌మ‌ని సంద‌ప్ర‌దించ‌వ‌చ్చ‌ని పేర్కొంటొంది. ఇటీవల‌ న‌గ‌రాన్ని భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తిన‌ప్పుడు సైతం పోలీసు యంత్రాంగం ఏ విధంగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మయిందో మ‌నంద‌రం చూసిందే. ఇలా ప్ర‌తీ చ‌ర్య‌లో ఫ్రెండ్లీ పోలిసింగ్‌ను అనుస‌రిస్తూ పౌరుల మ‌న్న‌ల‌ను పొందుతుంది. ఇటువంటి ఘ‌ట‌నే న‌గ‌రంలోని అబిడ్స్ రోడ్‌లో చోటుచేసుకుంది. ఓ రోగిని ఆస్ప‌త్రికి చేర్చేందుకు వెళ్తున్న అంబులెన్స్‌కు ట్రాఫిక్ క్లియ‌ర్ చేయ‌డంలో ఓ కానిస్టేబుల్ చూపిన చొర‌వ‌, చేసిన ప్ర‌య‌త్నాలు స‌ర్వ‌త్రా నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు అందుకుంటున్నాయి. 


ప్ర‌తి అడుగు ప్ర‌జ‌ల కోసం, మీ భ‌ద్ర‌తే మాకు ముఖ్యం అంటూ క్యాప్ష‌న్‌ను జోడించి హైద‌రాబాద్ పోలీస్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియోను పోస్టు చేసింది. జి. బాబ్జీ అనే వ్య‌క్తి అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. మొజంజాహీ మార్కెట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో కోఠి వెళ్లే మార్గంలో ఓ అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన బాబ్జీ అంబులెన్స్ వెళ్లేందుకు ఎలాగైనా ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేయాల‌ని భావించాడు. త‌క్ష‌ణ‌మే రంగంలోకి దిగి అంబులెన్స్ ముందుకు వెళ్లి రోడ్డుపై ప‌రుగులు పెడుతూ వాహ‌న‌దారుల‌కు సూచ‌న‌లు చేస్తూ ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశాడు. ట్రాఫిక్ క్లియ‌ర్‌తో అంబులెన్స్ స‌కాలంలో ఆస్ప‌త్రికి చేరుకోవ‌డంతో అందులోని వ్య‌క్తి ప్రాణాలు నిల‌బ‌డ్డాయి. ఈ వీడియో బుధ‌వారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అన్నింటికంటే విలువైన‌ది ప్రాణం. ప్రాణం విలువ తెలిసిన బాబ్జీ చూపిన చ‌ర్య పోలీసు ఉన్న‌తాధికారులు, నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది.