శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 02:10:59

సాఫ్ట్‌వేర్‌ కుటుంబం ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్‌ కుటుంబం ఆత్మహత్య
  • భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి బలవన్మరణం
  • వ్యాపారంలో నష్టమే కారణమని సూసైడ్‌ నోట్‌
  • హైదరాబాద్‌ హస్తినాపురంలో విషాదం

మన్సూరాబాద్‌/నేరెడుగొమ్ము: వ్యాపారంలో నష్టాలతో మనోధైర్యం కోల్పోయిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యాపారంలో నష్టంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ హస్తినాపురంలో సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. ఎల్బీనగర్‌ సీఐ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ముకు చెందిన కొట్ర యాదయ్య, కలమ్మ దంపతుల కుమారుడైన ప్రదీప్‌కుమార్‌ (36) వివాహం 2012లో నాగర్‌కర్నూ ల్‌ జిల్లా కొండారెడ్డిపల్లికి చెందిన స్వాతి (28)తో జరిగింది. వీరికి కుమారులు కల్యాణకృష్ణ (6), జయకృష్ణ (ఏడాదిన్నర) ఉన్నారు. ప్రదీప్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కాగా, స్వాతి ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడలిస్ట్‌. రెండేండ్లపాటు బెంగళూరు టీసీఎస్‌లో పనిచేసి ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఐబీఎంలో నెలకు రూ.70 వేల జీతంతో ప్రదీప్‌ ఉద్యోగం చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తూనే సొంతంగా ఎదిగేందుకు వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టారు. శుక్రవారం తల్లిదండ్రులకు ఫోన్‌చేసి పెండ్లి కోసం కరీంనగర్‌ వెళ్తున్నట్టు చెప్పారు. శనివారం వారి ఫోన్‌ స్విచ్చాఫ్‌ అని వచ్చింది. ఆదివారం తిరిగి ఫోన్‌చేసినా అందుబాటులోకి రాలేదు. నగరంలోనే ఉంటున్న స్వాతి అన్న సతీశ్‌కుమార్‌ ఆదివారం అర్ధరాత్రి ఎల్బీనగర్‌ ఠాణాలో ఫిర్యాదుచేయగా, పోలీసులు తెల్లవారుజామున 3 గంటలకు ప్రదీప్‌కుమార్‌ ఇంటికి చేరుకొన్నారు.


కిటికీ పగులగొట్టి చూడగా..

ప్రదీప్‌ ఇంటి కిటికీ అద్దం పగులగొట్టి చూడగా.. హాల్‌లో ప్రదీప్‌కుమార్‌ నిర్జీవంగా కనిపించారు. స్థానికుల సహకారంతో డోర్‌ను పోలీసులు బలవంతంగా తెరిచి ఇంట్లోకి ప్రవేశించారు. హాల్‌లో ప్రదీప్‌కుమార్‌, బెడ్‌రూంలో స్వాతి, ఇద్దరు కుమారులు నోటి వెంట నురగలతో శవమై కనిపించారు. గుర్తుతెలియని విషాన్ని కలుపుకొని తిని నలుగురూ మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ప్రదీప్‌.. భార్య, పిల్లలకు శనివారం మధ్యాహ్నం విషమిచ్చి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక నాగార్జున స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్న కల్యాణకృష్ణను శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లోకి తీసుకెళ్తుండగా పరిచయస్తుడైన ఆటోడ్రైవర్‌ నర్సింహ కొద్దిసేపు ముచ్చటించారు. అర్జంట్‌ అంటూ ప్రదీప్‌ ఇంట్లోకి వెళ్లినట్టు నర్సింహ చెప్పారు. ఆ వెంటనే ఓ స్నేహితుడు ఫోన్‌ చేయగా గాభరాగా కనిపించినట్టు దర్యాప్తులో తేలింది. మొదట భార్య, పిల్లలకు విషమిచ్చి.. వారు చనిపోయిన పది గంటల తర్వాత ప్రదీప్‌విషం తాగినట్టు ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలినట్టు సమాచారం.


ఆస్తులు ఉన్నా..

ప్రదీప్‌ తన సూసైడ్‌ నోట్‌లో రాసిన విధంగా ఆయనకు రూ.22 లక్షల అప్పు ఉన్నది. నెలకు రూ.70 వేల జీతంతోపాటు ఇంటి అద్దెలు రూ.20 వేల వరకు వస్తుంటాయి. ప్రస్తుతం ఆయనుంటున్న ఇల్లు విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. సమీపంలోని వెంకటేశ్వరకాలనీలో ప్రదీప్‌కు 200 గజాల స్థలం ఉన్నది. అతడి తండ్రికి ఊరిలో పదెకరాల భూమితోపాటు ఓ రైస్‌మిల్లులో వాటాలు ఉన్నట్టు బంధువులు తెలిపారు. 


వ్యాపారంలో నష్టమంటూ నోట్‌

‘నాన్నా.. మీకు నేను రాసే చివరి సందేశం ఇదే అనుకుంటా. మీకు ఏదేదో చెప్పాలనుకున్న. చెప్పలేక పోతున్న. నన్ను క్షమించు నాన్న. నాకు ఇంతకంటే మార్గం కనిపించలేదు. నీ మంచి చెడులు చూసుకోవాల్సిన నేనే మిమ్మల్ని వదిలి వెళ్లి పోతున్నా. లైఫ్‌లో ఏదో చేయాలని, జాబ్‌పై డిపెండ్‌ అవ్వొద్దనే ఉద్దేశంతో.. నాకంటూ ఓ కంపెనీ ఉండాలనే ఆలోచన. డబ్బులు సంపాదించి నాకున్న హోంలోన్‌ అయిపోగొట్టాలి అనే ఆలోచనలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న. పర్సనల్‌ లోన్‌ తీసుకొని హోంలోన్‌ను ఎల్‌ఐసీకి మార్చి.. రూ.22 లక్షలు తీసుకొని చాలా పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్న. తిరిగి చూస్తే అప్పు తప్ప ఏమీ కనిపించలేదు. ఒకడు నా ఇంటికి వచ్చి నిలదేసే దాక ఎదురు చూడలేను. ఎంతో ప్రేమతో ఇల్లు కట్టుకున్న. ఇది నాకు అమ్మ ఉంచిపోయిన జ్ఞాపకంగా భావించాను. ఇంతగా అప్పులైన విషయం స్వాతికి కూడా తెలియదు. ఎవరికి చెప్పాలో అర్థం కాదు.. ఎలా తీర్చాలో దారి దొరకడం లేదు’ అంటూ సూసైడ్‌నోట్‌ రాశారు.


ఇలా చేస్తాడనుకోలేదు

వ్యాపారంలో పెట్టుబడి రూ.40 లక్షలు నష్టం వచ్చినట్టు కొన్నిరోజుల క్రితం చెప్పాడు. అప్పు తీర్చేందుకు పైసలు ఇస్తానన్నా ఒప్పుకోలేదు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. అన్ని విధాలా ఉండి కొడుకు, కోడలు, మనుమండ్లను కోల్పోయాను. ఒక్కగానొక్క కొడుకు ఇలా చేస్తాడనుకోలేదు.

- యాదయ్య, ప్రదీప్‌కుమార్‌ తండ్రి logo