మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 03:15:42

సోనూసూద్‌ మరో సాయం

సోనూసూద్‌ మరో సాయం

  • ‘కూరగాయల’ శారదకు కొలువు
  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి జాబ్‌ ఆఫర్‌!
  • ట్విట్టర్‌లో వెల్లడించిన రియల్‌ హీరో 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సాయం చేసేందుకు ప్రాంతంతో పనిలేదు. భాషతో అవసరంలేదు. మంచి మనసుంటే చాలు. వెండితెర మీద విలన్‌పాత్రలు పోషిస్తూ నిజజీవితంలో రియల్‌ హిరోగా నిలుస్తున్నారు సోనూసూద్‌. కరోనా సంక్షోభంలో ఆపదలో ఎవరున్నా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయిన తెలంగాణకు చెందిన టెకీ శారదకు సోనూసూద్‌ జాబ్‌ఆఫర్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. వరంగల్‌ జిల్లాకు చెందిన శారద కుటుంబం చాలాకాలం కిందటే ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలసవచ్చారు. ఆమె బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివారు. కొన్నాళ్లు ఢిల్లీలో ఉద్యోగం చేశారు. తర్వాత హైదరాబాద్‌కు తిరిగొచ్చి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరారు. మూణ్నెల్లు పనిచేశాక కరోనా కల్లోలంతో పరిస్థితులు మారిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా కంపెనీ సంక్షోభంలో పడింది. శారద.. ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. అయినా ఆమె కుంగిపోలేదు. ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. తన తండ్రి నమ్ముకున్న వ్యాపారాన్ని శారద ఎంచుకున్నారు. నగరంలోని శ్రీనగర్‌కాలనీలో కూరగాయలు విక్రయించడం మొదలుపెట్టారు. ఇది ప్రసారమాధ్యమాలు, సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. విషయాన్ని ఓ నెటిజన్‌ ట్విట్టర్‌ ద్వారా సోనూసూద్‌ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. ‘మా ప్రతినిధి శారదను కలిశారు, ఇంటర్వ్యూ పూర్తయింది. జాబ్‌ లెటర్‌ కూడా ఆమెకు పంపించాం. జై హింద్‌' అని సోనూసూద్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. ఆయన ఔదార్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. జాబ్‌ ఆఫర్‌ ప్రకటించడంపై శారద సంతోషాన్ని వ్యక్తంచేశారు. ‘రియల్‌ హీరో సోనూసూద్‌' అంటూ అభిమానాన్ని చాటుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ కుటుంబానికి కూడా సోనూసూద్‌ ట్రాక్టర్‌ పంపించి సాయంచేసిన విషయం తెలిసిందే.


logo