గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 02:10:47

రికార్డుల వాన ఈ సీజన్‌లో

రికార్డుల వాన ఈ సీజన్‌లో

  • 110.2 సెం.మీ.నమోదు
  • 33 ఏండ్ల కిందట 83.2 సెం.మీ. వర్షం
  • రాష్ట్రంలో ఇప్పటికే 45% ఎక్కువ వానలు
  • హైదరాబాద్‌ నగరంలో 48% అధికం
  • 82 రోజులపాటు వర్షాలతో మరో ఘనత
  • ఈ వర్షాకాలం దశాబ్దాల రికార్డులను బద్దలుకొట్టింది. కుండపోతలతో పాత 
  • లెక్కలను తుడిచేసింది. దంచికొట్టడంలోనే కాదు.. ఎక్కువరోజులు వర్షాలు 

కురిసిన సీజన్‌గానూ రికార్డుకెక్కింది. రాష్ట్రంలో ఈ వానాకాలంలో సాధారణం కన్నా సుమారు 45% అధిక వర్షపాతం నమోదుకావడంతోపాటు ఒకే సీజన్‌లో 82 రోజులు వర్షాలు కురిసి రెయిన్‌ ఫుల్‌ డేస్‌లోనూ గత రికార్డులను తిరుగరాసింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వర్షమం టే 3నెలల ముచ్చటే అనుకుంటుంటాం. కానీ, ఈ సీజన్‌లో కురిసిన వర్షం 33 ఏండ్ల రికార్డులను తుడిచేసింది. ఈ వర్షాకాలంలో సాధారణం కంటే సుమారు 45% అధిక వర్షపాతం నమోదైంది. వాతావరణశాఖ లెక్కల ప్రకారం సెప్టెంబర్‌ 30వ తేదీకే వానాకాలం ముగిసినా.. నైరుతి రుతుపవనాలు ఇంకా చు రుకుగానే ఉన్నాయి. వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో గత సీజన్‌వరకు అత్యధికంగా 1988లో 83.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది వర్షాకాలంలో ఏకంగా 110.2 సెంటీమీటర్ల వర్షం కురిసి 33 ఏండ్ల కిందట నమోదైన రికార్డులను తుడిచేసింది. ఇది సాధారణం కంటే సు మారు 45% అధికం. ఆగస్టులో 78%, సెప్టెంబర్‌లో 94% అధిక వర్షపాతం న మోదైంది. ఈ ఏడాది అన్ని ప్రాం తాల్లో సమృద్ధిగా వర్షాలు కురిశా యి. ఒక్క జిల్లాలో కూడా లోటు వర్షపాతం నమోదుకాలేదు. హైదరాబాద్‌ నగరంలోనూ ఈ సీజన్‌ లో 48% అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా 56.21 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉం డగా ఈసారి 82.97 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక, ఈ నెల 1 నుంచి మంగళవారం వరకు సాధారణం కంటే 51% అధిక వర్షపాతం నమోదైంది. ఈ 13 రోజు ల్లో అత్యధికంగా మహబూబాబాద్‌ జిల్లాలో 144% వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్‌ నగరంలోనూ 14 రోజుల్లో సాధారణం కంటే 404% అధిక వర్షాలు కురవడం గమనార్హం. 

వరుస అల్పపీడనాలు.. షీర్‌ జోన్లు 

ఈ ఏడాది అత్యధిక వర్షాలు పడటానికి ప్రధాన కారణాలను విశ్లేషిస్తే.. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదిలేందుకు ఈ ఏడాది వరుస అల్పపీడనాలు, షీర్‌జోన్లు (రెండు ఆవర్తనాలు ఎదురెదురుగా ఏర్పడటం) బాగా కలిసివచ్చాయి. జూన్‌, జూలైలో ఒక్కొక్కటి చొ ప్పున అల్పపీడనం ఏర్పడగా, ఆగస్టులో ఏకం గా ఐదు, సెప్టెంబర్‌లో మూడు ఏర్పడ్డాయి. ఈ నెలలోనూ 1న ఒకటి,9న మరోటి ఏర్పడింది.సాధారణంగా సెప్టెంబర్‌ 30 నుంచి  రుతుపవనాలు క్రమంగా నిష్క్రమిస్తుంటా యి. కానీ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభంకాకపోగా, మరింత చురుకుగా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో ఈనెల ఒకటినుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కురుస్తున్నవి పోస్ట్‌ మాన్‌సూన్‌ వర్షాలని అధికారులు చెప్తున్నారు.

నైరుతి ఉపసంహరణ ఇంకా మొదలు కాలేదు

వరుస అల్పపీడనాలతో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఇంకా చురుకుగానే ఉన్నాయి. నిష్క్రమణ ప్రారంభం కాలేదు. వచ్చేవారం వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చు. ఈసారి వరుసగా వచ్చిన అల్పపీడనాలు, షీర్‌జోన్లతో రికార్డుస్థాయిలో వర్షాలు కురిశాయి. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వానలు కురిశాయి. సెప్టెంబర్‌ 30 తర్వాత కూడా నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉండటం సాధారణమే. అయినప్పటికీ ఈ ఏడాది అవి మరింత చురుకుగా ఉన్నాయి.

- రాజారావు, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి

‘రెయిన్‌ ఫుల్‌' డేస్‌లోనూ రికార్డే

ఈ ఏడాది వర్షాకాలం 120 రోజు ల్లో (జూన్‌ 1నుంచి సెప్టెంబర్‌ 30 వరకు) 82 రోజులు వర్షాలు కురిశాయి. 1988-89 నుంచి 2020-21 సీజన్‌ వరకు తీసుకుంటే 2010 -11 సీజన్‌లో ఒకే ఒక్కసారి 81 రోజులపాటు వర్షాలు కురిశాయి. ఆ రికార్డును చెరిపేస్తూ.. ఈసారి 82 రోజులు వర్షం కురిసింది. ఈ సీజన్‌లో నెలలవారీగా చూస్తే జూన్‌లో 16 రోజులు, జూలైలో 24 రోజులు, ఆగస్టులో 25 రోజులు, సెప్టెంబర్‌లో 17 రోజులు కలిపి మొత్తం 82 వర్షపు రోజులు నమోదయ్యాయి. ఈ సీజన్‌ లో దినసరి సగటు వర్షపాతం 13.2 మి.మీ.గా నమోదైంది. ఇదీ కూడా ఒక రికార్డే. వరుసగా రెయినీ డేస్‌ ఉండటం అరుదని అధికారులు చెప్తున్నారు. ఈ సీజన్‌లో ఒకే రోజులో (ఈ నెల 13న) 32 సెం.మీ.తో అత్యధిక వర్షం కురిసిన ప్రాంతంగా మేడ్చల్‌ మల్కాజిగిరి ్లలోని ఘట్‌కేసర్‌ రికార్డు నమోదుచేసింది. హైదరాబాద్‌కు వస్తే అక్టోబర్‌ 14న బేగంపేట్‌లో 19.2 సెం.మీ. అత్యధిక వర్షం కురిసింది.logo