బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 03, 2020 , 17:24:07

కరోనా భయంతో రిటైర్డ్‌ జడ్జి ఆత్మహత్య

కరోనా భయంతో రిటైర్డ్‌ జడ్జి ఆత్మహత్య

హైదరాబాద్‌ : కరోనా వైరస్ సంక్రమించిందనే భయంతో మియాపూర్‌కు చెందిన ఓ రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. న్యూ సైబర్ వ్యాలీలో నివసిస్తున్న ఆర్ రామచంద్రరెడ్డి ఐదేండ్ల క్రితం వరంగల్ జిల్లా న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఈయనకు భార్య, కొడుకు, కోడలు, మనుమరాలు ఉన్నారు.

అక్టోబర్ 1న రాత్రి 9 గంటల సమయంలో భోజనం చేసిన తర్వాత తన బెడ్రూంలోకి ఒంటరిగా వెళ్లి తలుపువేసుకున్నాడు. మరుసటిరోజు ఉదయం 8:30 గంటలకు అల్పాహారం కోసం కిందికి రాకపోవడంతో అతని భార్య పడకగదికి వెళ్లగా సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాజీ జడ్జి తన ప్రాణాలను తీసుకోవడానికి గల కారణాలను రాసిన ఒక సూసైడ్ నోట్ కనుగొన్నట్లు మియాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ రవి కిరణ్ చెప్పారు. రక్తపోటు, డయాబెటిస్, క్షయవ్యాధితో బాధపడుతున్నాను అని, కొవిడ్‌ సంక్రమిస్తే చికిత్స తీసుకుని బతకడం  కష్టమని భావించి చనిపోతున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారని, తన కుటుంబానికి ఎటువంటి హాని కలిగించకూడదని పోలీసులను కోరారని సీఐ రవికిరణ్‌ తెలిపారు. భార్య, కొడుకు, కోడలు, మనవరాలుతో చాలా సంతోషంగా ఉన్నానని, జీవితంలో కోరుకున్నదంతా నెరవేర్చానని కూడా నోట్‌లో రాశారని సీఐ చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo