హైదరాబాద్ : గడిచిన జూన్, జూలై మాసాల్లో హైదరాబాద్‌లో సాధారణానికి మించి నమోదైన వర్షపాతం ఆగస్టు నెలలో మాత్రమే సాధారణం కంటే తక్కువగా నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం.. గడిచిన మూడు వారాలు నగరంలో తక్కువ వర్షపాతం నమోదైంది. వివిధ ప్రాంతాల్లోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ డేటా ప్రకారం ఆగస్టు మొదటి వారంలో 96 శాతం, రెండో వారంలో 89 శాతం, మూడో వారంలో 47 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
అంబర్‌పేట, హిమయత్‌నగర్, గోల్కొండ వంటి ప్రాంతాలు ఈ సీజన్లో తక్కువ వర్షపాతాన్ని చవిచూశాయి. కాగా బహదూర్‌పుర, బండ్లగూడ జూన్ 1వ తేదీ నుంచి మరి తక్కువ వర్షపాతాన్ని చూశాయి. ఈ రెండు ప్రాంతాల్లో సాధారణం కంటే 12 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది.
తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలు ఆగస్టు నెలారంభం నుండి తక్కువ వర్షపాతాన్నే అనుభవిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల ఈ రెండు జిల్లాల్లో ఈ నెలలో అత్యధిక వర్షలేమి నమోదైంది. నిర్మల్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాలు మాత్రమే గతవారం సాధారణ వర్షపాతాన్ని చవిచూశాయి.