మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 00:43:22

హైదరాబాద్‌లో రియల్టీ జోరు

హైదరాబాద్‌లో రియల్టీ జోరు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా దెబ్బకు కుదేలైన నిర్మాణ రంగం తిరిగి కోలుకుంటున్నది. ఇండిపెండెంట్‌ ఇండ్లు, హైదరాబాద్‌ శివారులో విల్లాలు కొనేందుకు చాలామంది ముందుకొస్తున్నారు. లాక్‌డౌన్‌లో కూలీలు, ముడిసరుకు దొరక్క నిలిచిపోయిన భవనాలు, అపార్టుమెంట్ల నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌ జిల్లాల్లోనూ ఇండ్లు, విల్లాల విక్రయాలు పెరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు పెరుగుతు న్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా 7,30,728 రిజిస్ట్రేషన్లు అవగా, రూ. 2,722.06 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌, మే, జూన్‌లలో  రూ.350 కోట్లు మాత్రమే సమకూరింది. లాక్‌డౌన్‌కు ముందు రోజు వరకు సగటున 5వేల నుంచి 6వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కానీ ఈ తొలి త్రైమాసికంలో రోజుకు 100 కూడా కాని దుస్థితి. అయితే జూలై, ఆగస్టు నెలల్లో ఇండ్లు, విల్లాల కొనుగోళ్లు పెరుగడంతో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. ఈ 2 నెలలు కలుపుకొని ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు రూ.1241.01 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం రోజుకు 4 వేల నుంచి 5 వేల డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అవుతున్నాయి. 


logo